– రుణ మంజూరులో వెండర్లు, బ్యాంకర్లకు మధ్య సమన్వయం ముఖ్యం
– ఆదర్శ సౌర గ్రామాల్లో 100 శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, రుణ మంజూరులో వెండర్లు, బ్యాంకర్లమధ్య సమన్వయం ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
సూర్యఘర్ పథకం కింద లబ్దిదారులకు రుణాల మంజూరుపై శనివారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులు, వెండర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెళ్లను అమర్చి జిల్లాను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందని.. ఇప్పటివరకు 72,000 రిజిస్ట్రేషన్లు వచ్చినందున, ఇన్‌స్టలేషన్స్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చొరవచూపాలన్నారు. ప్రజలకు కరెంటు బిల్లుల భారాన్ని తప్పించేందుకు, పర్యావరణ పరిరక్షణకు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ఈ పథకం వీలుకల్పిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ మినహా మిగిలిన సొమ్మును బ్యాంకర్లు రుణంగా మంజూరు చేయవలసి ఉంటుందన్నారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో వెండర్లకు బ్యాంకర్లకు మధ్య సమన్వయం అవసరమన్నారు. బ్యాంకర్లు త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాలుగా గుర్తించిన బూదవాడ (జగ్గయ్యపేట), వెల్వడం (మైలవరం), పరిటాల (కంచికచర్ల), కంభంపాడు (ఎ.కొండూరు), షేర్ మహమ్మద్ పేట (జగ్గయ్యపేట) గ్రామాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు లక్ష్యాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, త్వరితగతిన 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయా మండలాల అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, సూర్యఘర్ జిల్లా నోడల్ అధికారి ఎం.భాస్కర్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.