– ఊరూవాడా స్వచ్ఛతా మార్గంలో పయనించాలి
– స్వచ్ఛతా స్ఫూర్తి ఒక్క రోజుతో ఆగిపోకూడదు
– అది మన రోజువారీ జవితంలో భాగం కావాలి
– సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు గట్టిగా కృషిచేయాలి
– ఏ రైతు బజారులోనూ పాలిథిన్ సంచులు కనిపించకూడదు
– క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలి
– అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. ప్రతినెలా మూడో శనివారాన్ని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర దివస్‌గా గుర్తించినందున, గత నెలలో మాదిరి ఈసారి కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 15వ తేదీ మూడో శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లాస్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులతో కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతినెలా ఒక ఇతివృత్తంతో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని.. ఈనెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో స్వచ్ఛదివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్‌యార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ప్రతిచోటా స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని.. ఈ స్ఫూర్తి ఒక్కరోజుతో ఆగిపోకూడదని, స్వచ్చత అనేది మన రోజువారీ జీవితంలో భాగం కావాలని స్పష్టం చేశారు. స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటిచెప్పడంతో పాటు సింగిల్ యూజి్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు వంటివి నిర్వహించాలన్నారు. ఏ రైతు బజారులోనూ పాలిథిన్ సంచులు కనిపించకూడదని.. క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. చికెన్, మటన్ దుకాణాల్లోనూ పాలిథిన్ సంచులు ఉపయోగించకుండా గట్టి నియంత్రణా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను కూడా చేయించాలని సూచించారు. ప్రతి శాఖా తమ పరిధిలో స్వచ్ఛతా ప్రమాణాలను చేరుకునేలా కృషిచేయాలని, చేపట్టిన కార్యక్రమాల వివరాలను స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో పాటు పంచాయతీరాజ్, వైద్యారోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయం.. ఇలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
టెలీకాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు హాజరయ్యారు.