-ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకూ పరీక్షలు
-3వేల 450 పరీక్షా కేంద్రాలు-హాజరుకానున్న 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు
-పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు
-పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు,నెట్ సెంటర్లను మూసి ఉంచాలి
-ఫేక్ న్యూస్,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
-రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించొద్దు
-జిల్లా కలక్టర్లు,ఎస్పిల స్థాయిలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకూ నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లు,ఎస్పిలు,విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు.పదవ తరగతి పరీక్షలపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లు, ఎస్పిలతో వీడియో సమావేశం ద్వారా సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చీఫ్ సూపరింటిండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటువద్దే వాటిని సేకరించి భద్రపర్చి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలన్నారు.పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని చెప్పారు.అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు,నెట్ సెంటర్లన్నీ మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
పరీక్షలు జరిగే సమయంలో వివిధ సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీకు వంటి వదంతులు లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.ఎక్కడైనా అలాంటివి వ్యాప్తి జరిగితే వెంటనే విచారణ చేసి తగిన స్పష్టత ఇవ్వాలని నకిలీ వార్తలు ప్రసారం చేసినట్టు తేలితే అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇటీవల బిఇడి పరీక్షల నిర్వహణ సమయంలో పేవర్ లీక్ వంటి వదంతులు వచ్చాయని కావున అలాంటి వాటిపై పూర్తి అప్రమత్తంగా ఉండి పరీక్షల సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు.రానున్న10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేలా వెంటనే జిల్లా కలక్టర్,ఎస్పిల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు.సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృషి సారించాలని కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
అంతకు ముందు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి వపర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ మొత్తం 3వేల 450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైన సిసిటివి కెమెరా సర్వెలెన్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.10వ తరగతి పరీక్షలకు మొత్తం 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు హాజరు కానుండగా వారిలో 3లక్షల 15వేల 697 మంది బాలురు,3లక్షల 3వేల 578 మంది బాలికలు హాజరు కానున్నారని తెలిపారు.కర్నూల్,అనంతపురం,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు హాజరు కానున్నట్టు చెప్పారు.పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్,682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని అన్నారు.అలాగే ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడలు అధికారులను నియమించామని తెలిపారు.రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లాల్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలక్టర్లకు సూచించారు.పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్పిడెన్సిషల్ మెటీరియల్ ను ఇప్పటికే జిల్లాలకు పంపడం జరిగిందని అన్నారు.వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలని,ప్రతి కేంద్రంలో ప్రధమ చికిత్స వంటి సేవలకు ఒక ఎఎన్ఎంను అందుబాటులో ఉంచాలని సూచించారు.పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాకు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
అదే విధంగా మార్చి 17 నుండి 28 వరకూ 10వ తరగతి(ఏపెన్ స్కూల్)పబ్లిక్ పరీక్షలు ప్రతి రోజు ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.30గం.ల వరకూ జరగనున్నాయని ఈపరీక్షలకు 30వేల 334 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని డైరెక్టర్ విజయ రామరాజు చెప్పారు.ఈపరీక్షలను కూడా 471 రెగ్యులర్ పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.రానున్న పరీక్షలను సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు విజయ రామరాజు వివరించారు.
ఈసమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,సిసిఎల్ఏ జి.జయలక్ష్మి,పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.అలాగే జిల్లా కలక్టర్లు,ఎస్పిలు,జెసిలు,డిఇఓలు,సంబంధిత శాఖల అధికారులు ఈసమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు.