Breaking News

రీ సర్వేలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాం

-జాయింట్ ఎల్పీమ్ ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
-ప్రస్తుతం భూముల రిజిస్ర్టేషన్లకు ఎటువంటి ఇబ్బందుల్లేవు
-శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ కాలంలో జరిపిన రీ సర్వేలో తలెత్తిన సమస్యలను దాదాపు 98 శాతం పైగా పరిష్కరించామని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జాయింట్ ఎల్పీఎమ్ లలో ఏర్పడిన సమస్య కారణంగా భూ యజమానులు భూములు మ్యుటేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత ప్రభుత్వం శాస్ర్తీయంగా రీ సర్వే ప్రాజెక్ట్ ను అమలు చేయకపోవడం వలనే ఈ సమస్యలు తలెత్తాయని చెప్పారు. మంగళవారం శాసనసభలో రీ సర్వేలో తలెత్తిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధాన మిచ్చారు. జాయింట్ ఎల్పీఎమ్ లలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. ఒకే ఎల్పీఎమ్ లో వేర్వేరు భూ యజమానులు ఉండడంతో వారిని వ్యక్తిగత ల్యాండ్ పార్సిల్స్ గా సబ్ డివిజన్ చేసేంత వరకు వారు తమ ఆస్తులను మ్యుటేషన్ లేదా రిజిస్ర్టేషన్ చేయించడానికి ఇబ్బంది ఏర్పడిందన్నారు. జాయింట్ ఎల్పీఎమ్ లను విడగొట్టి రిజిస్ర్టేషన్ కు అనుకూలంగా మార్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సబ్ డివిజన్ సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టామన్నారు. సబ్ డివిజన్ చేసుకునే భూ యజమానులకు 01.01.2025 నుండి ఆరు నెలల పాటు ఫీజు నుండి మినహాయింపు నిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. భూ యజమానులు ఇబ్బంది లేకుండా తమ భూములను సబ్ డివిజన్ చేయించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. భూ యజమానుల కోరిక మేరకు సరిహద్దు తప్పులను సరిచేసేందుకు గాను బీఎస్ఓ 34 పేరా నెంబర్ 8 లో వీలు కల్పించబడిందన్నారు. ఇప్పటివరకు సబ్ డివిజన్ కోసం 85,571 దరఖాస్తులు రాగా 69,142 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ప్రస్తుతం రైతులు, భూయజమానులు తమ భూములను రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు.

రీ సర్వే సమస్యల్లో 98 శాతం పరిష్కారం :
గత ప్రభుత్వ కాలంలో 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారని, కానీ ఆ రీ సర్వే అంతా తప్పుల తడకగా మారిందన్నారు. రీ సర్వేకు సంబంధించి భూ యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, రీ సర్వే పూర్తయిన తర్వాత భూ యాజమానులు అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులగా ఉన్న గడువును 21 రోజులకు కుదించారన్నారు. నిబంధనల ప్రకారం కాకుండా సరిహద్దు రాళ్లపైన తమ బొమ్మలు వేసుకోవాలనే పిచ్చితో హడావిడిగా రీ సర్వే చేశారన్నారు. పాస్ పుస్తకాలపైన తన బొమ్మలు వేసుకోవాలనే పిచ్చి తప్ప రీ సర్వేను సక్రమంగా చేయాలనే ఆలోచన అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. దీంతో భూ విస్తీర్ణం, సరిహద్దు, పేర్లు దిద్దుబాటు, భూ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు అసంతృప్తివ్యక్తం చేశారన్నారు. వీటన్నింటీని సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు నిర్వహించి అర్జీలు స్వీకరించిందని చెప్పారు. వీటికి సంబంధించి దాదాపు 2,79,712 అర్జీలు రాగా 2,73,296 అర్జీలను అంటే దాదాపు 98 శాతం అర్జీలను పరిష్కరించామన్నారు.
పకడ్బందీగా రీ సర్వే తిరిగి ప్రారంభం :
జనవరి 20వ తేదీన తమ ప్రభుత్వం భూముల రీ సర్వేను తిరిగి ప్రారంభించిందని, అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గా ఎన్నుకొని రీ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామాన్ని బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాక్ కు అధికారులను కేటాయించి రోజుకు 20 ఎకరాల మేరకే రీ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. రీ సర్వే చేసే ముందు ఆ భూమికి సరిహద్దులో ఉన్న భూ యజమానులందరికీ నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే రీ సర్వే చేస్తున్నారని చెప్పారు. ఒక బ్లాక్ లో ఉన్న భూ యజమానులందరికీ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి అందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. స్థానికంగా నివాసముండని భూ యజమానుల విషయంలో వాట్సాప్ కాల్ లేదా వీడియో మెసేజ్ ద్వారా వారికి సమాచారాన్ని పంపి వారి సమ్మతి తీసుకోవడం మరియు సర్వే సమయంలో వారి ప్రతినిధిని నియమించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అడ్వాన్స్ నిధులతో శ‌ర‌వేగంగా పోలవరం పనులు

-2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… నిమ్మల పునరుద్ఘాటన. -కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు- మంత్రి నిమ్మల రామానాయుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *