గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని క్యాంటీన్ వద్ద వారం రోజుల్లో ఉన్న ఫ్లోర్ మరమత్తులు పూర్తి చేయాలని ఏఈని ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్ లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియ చేయవచ్చన్నారు.
