-పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు , నిరంతర విద్యుత్తు సరఫరా, మెడికల్ క్యాంపు నిర్వహించాలి
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 25,723 మందివిద్యార్ధులు 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి క్షేత్ర స్థాయి విద్యా అధికారులు ప్రధానోపాధ్యాయులు తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, 10 వ తరగతి వార్షిక పరీక్షలను ఎటువంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాఠశాల పునర్ వ్యవస్థీకరణ లో భాగంగా 951 స్కూల్స్ కి చెందిన వాటిలో ఇప్పటికే 570 స్కూల్స్ గుర్తించడం జరిగిందన్నారు. వాటిలో 504 స్కూల్స్ అంగీకారం తెలియ చెయ్యగా, 66 స్కూల్స్ అంగీకారం తెలియ చెయ్యనందున స్కూల్ వారీగా అభ్యoతరాలు పై నివేదిక అందచేయాలని ఆదేశించారు. 381 స్కూల్స్ కి చెందినవి పరిశీలన దశలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 22 వేల మంది బడి బయట పిల్లలు ఉన్నారనీ, వేరొక స్కూలు లో చదువుతుండడం, బదలీపై వెళ్లడం, తదితర కారణాల వల్ల డ్రాప్ అవుట్ కింద నమోదు అవ్వడం జరిగిందన్నారు. వారిలో 19 వేల విద్యార్థుల డేటా ఆధారంగా 86.23 శాతం గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థి వారీగా డేటా ఆయా స్కూల్స్ కి , మండలాలకు పంపడం జరిగిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలక్టర్ సూచించారు. వొచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా బోధన విధానంలో సంస్కరణ లు తీసుకుని రావడం జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను భద్ర పరిచిన తెలిపారు. ఇప్పటికే జిల్లా సెట్ 1 , సెట్ 2 ప్రశ్న పత్రాలు చేరుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఆరు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు డి ఈ వో వాసు దేవరావు తెలిపారు. జడ్పీ హైస్కూల్ లు కడియపులంక, పోతవరం , రాజుపాలెం , జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ధవలేశ్వరం , ప్రభుత్వ హైస్కూల్ కొవ్వూరు , ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ భూపతిపాలెం అదనపు భద్రత కట్టుదిట్టం గా ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 24763 మందికి ( బాలురు 12791 బాలికలు 11972), ప్రవేటు విద్యార్థులు 960 ( బాలురు 591 , బాలికలు 369) మంది 134 పరీక్ష కేంద్రాల లో హాజరు కానున్నట్లు జిల్లా పాఠశాల విద్యా అధికారి కే వాసుదేవ రావు తెలిపారు.11 వందల మంది ఇన్విజరేటర్లు, 10 స్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్య అధికారి కె. వాసుదేవ రావు , ఎస్ ఎస్ ఏ ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.సుభాషిణి ఇతర అధికారులు, క్షేత్ర స్థాయి విద్యా శాఖ అధికారులు, మండల, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.