-దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్డీఏ పరిధిలోని టిటిడి ఎస్వీ ఆలయంలో మార్చి 15 న జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంతో ఆధ్యాత్మిక నగరంగా అమరావతి మారనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్వీ టెంపుల్ సమీపంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధానిలో టిటిడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టిటిడి ఆలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక టిటిడి ఎస్వీ ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణమహోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు తగ్గట్టుగా టిటిడి ఏర్పాట్లు చేపట్టిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అమరావతి నగర నిర్మాణానికి వేగంగా అడుగులు వేసేందుకు నాంది పలుకనున్నారని తెలిపారు. ఈ కళ్యాణోత్సవం వేడుకకు సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులతో రావాలని కోరారు.
శ్రీనివాస కళ్యాణోత్సవానికి ఎల్లుండి మధ్యాహ్నంకు ఏర్పాట్లు పూర్తి కానున్నాయని ఆయన చెప్పారు.
అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని మంత్రుల బృందం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి వి.అనిత, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి పి.నారాయణ, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, ఎం.శాంతారామ్, ఎం.ఎస్.రాజు, ఈవో జె. శ్యామల రావు, డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం, ఎస్పీ సతీష్ కుమార్ తదితర అధికారులు పరిశీలించారు.