-అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం
-12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు
-పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
శ్రీ పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ నిర్మిస్తామన్న సీఎం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పొట్టి శ్రీరాములు త్యాగఫలమే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది
జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారు. భూమిపై ఎంతోమంది పుడతారు కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది. బ్రిటిష్ వారు ప్రజలను ఇబ్బందులు పెట్టి, ఇక్కడి సంపదనంతా వారి దేశానికి తరలించుకుపోయారు. బ్రిటిష్ వారు పాలనా సౌలభ్యం కోసం కొన్ని ప్రెన్సిడెన్సీలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల్లో ప్రగాఢమైన ఆత్మాభిమానం వచ్చింది. పొట్టి శ్రీరాములు1901 మార్చి 16న మద్రాసులో పుట్టారు. పుట్టింది మద్రాసులోనైనా వారి కుటుంబం మొదట నెల్లూరులోనే ఉంది. ఏ భాష మాట్లాడేవారిని ఆ భాష వారే పాలించుకునే అవకాశం రావాలని పొట్టి శ్రీరాములు కోరుకున్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారు. ఆయన పోరాటం చేసే సమయంలో ప్రజలు పెద్దగా ముందుకురాలేదు. ఆ సమయంలో కేంద్రం కూడా దిగిరాలేదు. అయినా 58 రోజుల పాటు కఠోర దీక్షచేసి 1952 డిసెంబర్ 15న ఆత్మబలిదానం చేశారు. పొట్టిశ్రీరాములు చనిపోయిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు రేకెత్తాయి. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని 1952 డిసెంబర్ 19న పార్లమెంట్‌లో నెహ్రూ ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆ ఏడాది మార్చి 25న నాటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు. అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం స్వపరిపాలనలోకి వచ్చింది. తర్వాత తెలంగాణలో కలిసిపోవడం, మళ్లీ 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోడం జరిగిపోయింది. అందుకే ఆయన ఆత్మబలిదానంను డిసెంబర్ 15ను ఘనంగా నిర్వహించాం.’ అని సీఎం అన్నారు.
2047 నాటికి నెంబర్-1 రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం
పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ను 2047 నాటికి నెంబర్ వన్ గా మార్చాలని పనిచేస్తున్నాం. ఆయన పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన అభిమానులు, సమాజం ముందుకొచ్చి త్యాగాలను గుర్తు చేసేలా ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ముందుకొచ్చిన వారిని అభినందిస్తున్నా. ప్రజలు చేసేది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వ్యక్తుల త్యాగాలు ఒకట్రెండు రోజులు గుర్తుంచుకోవడం కాదు… చరిత్ర ఉన్నంత వరకు గుర్తుంచుకుని భావితరాలకు వారి స్ఫూర్తిని అందించాలి. తెలుగుజాతి కోసం ఏ విధంగా ఆత్మబలిదానం చేశారో చరిత్ర తెలియని వారికి వివరించాలి. పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టింది మేమే.
12 నెలలు…12 కార్యక్రమాలు
ఈ రోజుకు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టాం. వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతినెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపడతాం. అప్పటికి 125వ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇది జయప్రదం చేస్తే సమజాంలో సుస్థిరత ఉంటుంది. పెద్దపెద్ద భవనాలు కడుతున్నాం…. కానీ పక్కనే ఉన్నవారికి కనీసం ఇల్లు కూడా ఉండటం లేదు. అందరం సమానంగానే పుడతాం. కానీ చదువుకుని కొందరు అవకాశాలు ఉపయోగించుకుని ఇంకొందరు ఊహించని స్థాయికి వెళ్లిపోతారు. ఊర్లో ఉండేవారు అక్కడే ఉండిపోతారు. అందుకే పేదలను పైకి తీసుకురావాలి. రాబోయే 5 ఏళ్లలో పేదరిక నిర్మూలనకు ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఇబ్బందిలేకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. వైశ్యుల్లోనూ పేదలు ఉన్నారు. సమాజహితం కోసం అందరూ పని చేయాలి. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలి. తెలుగు రాష్ట్రం కోసం ఆయన ఆత్మబలిదానం చేశారు. కనీసం తెలుగుజాతి కోసం మీరు పదిమందిని పైకి తీసుకురావాలి… పదిమందికి ఆయన త్యాగాలను వివరించి స్ఫూర్తి రావాలి.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.