-అవార్డుగ్రహీతల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించాలి : లయజినింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకూ ఉందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వహణకు నియమించబడిన లయజినింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవార్డుగ్రహీతలైన అతిధులకు గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత లయజినింగ్ అధికారులదేనన్నారు. అతిథులతో మాట్లాడి, ఆయా జిల్లాల లయజినింగ్ అధికారులతో సంప్రతించి, అవార్డు గ్రహీతలు ఎప్పుడు ఏ సమయంలో వస్తారో కనుక్కోవాలన్నారు రాష్ట్రం లోని షుమారు 6 కోట్ల జనాభాలో 8 రంగాలలో కేవలం 62 మందిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డుల కోసం ఎంపిక చేసిందన్నారు. స్థానిక నోవాటెల్ హోటల్ లో అతిధులకు బస ఏర్పాటు చేశామన్నారు. వారు వచ్చే సమయానికి అతిధి మర్యాదలతో స్వాగతం పలకాలన్నారు. అనంతరం మరుసటిరోజు 13వ తేదీన జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఉదయం 10 గంటలలోపు అవార్డుగ్రహీతలు వారికీ కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యేలా చూడాలన్నారు. ముందుగానే డ్యూటీ పాసులు, అతిధులకు ఎంట్రీ పాసులు పొందాలన్నారు. అవార్దీలతోపాటు కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన చెప్పారు. 13వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి వస్తారన్నారు. అవార్దీలందరికి ప్రత్యేకంగా ఫోటోలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ ఫోటోలను తిరిగి వారి జిల్లాలకు పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల సెల్ఫీలు, ఇతర ఫోటోలు అనుమతించరని కలెక్టర్ చెప్పారు. వేదిక మీదకు అవార్దీ ఒక్కరే రావాలని చెప్పారు. ఆ సమయంలో వారు చేసిన సేవలపై ఒక నిముషంపాటు వీడియో రూపంలో చిత్ర ప్రదర్శన జరుగుతుందన్నారు. అవార్డు ప్రధానోత్సవం పూర్తి అయిన తరువాత ముఖ్యమంత్రితో గ్రూప్ ఫోటో కూడా ఉంటుందన్నారు. అవార్దీలకు మెడల్ ,విగ్రహం , ప్రశంసాపత్రం అందజేస్తారని, అవి అతిదులనుండి లయజినింగ్ అధికారులు స్వీకరించి వారి వాహనాలలో చేర్చాలన్నారు. అనంతరం అవార్డుగ్రహీతలు సాయంత్రం 4 గంటలకు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ ఆశీస్సులు కూడా తీసుకోవచ్చన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని రహదారులను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరిస్తున్నామన్నారు. కార్యక్రమానికి వచ్చే అతిధులకు ఆహ్వానం పలుకుతూ బ్యానెర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవార్దీలు వచ్చి కూర్చునే టేబుళ్ల వద్ద ఒక మంత్రి , అవార్దీ , అవార్దీలతో వచ్చే ఇద్దరికీ సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అవార్దీలకు ఆయా జిల్లాల లయజినింగ్ అధికారులతో మాట్లాడి మెడికల్ బృందాలు వారి ఇళ్లకు పంపించి కరోనా టెస్ట్ లు నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె.మాధవీలత, జాయింట్ కలెక్టర్ (ఆసరా )కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ , .జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు , తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పాల్గొన్నారు.