మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు 9,647 సంచుల సూపర్ ఫైన్ నాణ్యత గల బియ్యాన్ని సరఫరా చేశామని, విద్యార్థులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం నగరంలోని చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సంయుక్త కలెక్టర్ సూపర్ ఫైన్ నాణ్యత గల 25 కిలోల సంచుల బియ్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సూపర్ ఫైన్ రకం నాణ్యత గల బియ్యాన్ని ఈ జూన్ మాసం నుండి సరఫరా చేయాలని ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 6,855 సంచుల బియ్యం, సంక్షేమ వసతి గృహాలకు 2,792 సంచుల బియ్యం ఇప్పటికే చేరవేశామన్నారు. ప్రతి సంచి పైన క్యూఆర్ కోడ్ తో పాటు సంబంధిత రైతు పేరు, పిపిసి కేంద్రము, బియ్యం రకము, రైస్ మిల్లు, స్టోరేజ్ గోదాము, ధ్రువీకరించిన సాంకేతిక వ్యక్తి పేరు, మొదటి ప్యాకింగ్ ఏజెన్సీ పేరు తదితర వివరాలు ముద్రించబడి ఉంటాయన్నారు. ఇందులో ఏమాత్రం అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ అయ్యేందుకు పారదర్శకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సన్న బియ్యం సంబంధిత పాఠశాలలు, వసతి గృహాలు వద్దకే మొబైల్ యాప్ ద్వారా సంబంధిత ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, అధికృత ప్రతినిధులకు నేరుగా అందజేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శిరీష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్వరరావు, ఎంఈఓ గురు ప్రకాష్ తదితర తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News