-డీసీవో ఎమ్.వెంకట రమణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని, చిన్న రైతులు, మహిళా సంఘాలు, చిన్న సుక్ష్మ తరహా పరిశ్రమలు సహకార సూత్రాల ఆధారంగా ఆర్థికంగా ఎదుగుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారి ఎమ్.వెంకటరమణ అన్నారు. సహకార ఉద్యమం అనేది లాభం కోసం కాదనీ, సమాజ సంక్షేమం కోసమని జిల్లా సహకార అధికారి ఎమ్ వెంకట రమణ పేర్కొనారు. శనివారం ఉదయం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల నుండి ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ, “ఒక్కడంటే బలహీనుడు… అందర మంటే శక్తివంతులు” అనే సత్యాన్ని ప్రతిఫలిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై మొదటి శనివారం నాడు జరుపుకునే 103 వ అంతర్జాతీయ సహకార దినోత్సవం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఘనంగా నిర్వహించారు.
తొలుత ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద సహకార పతాక ఆవిష్కరణ చేసి అనంతరం జరిగిన సభలో జిల్లా సహకార అధికారి ఎమ్.వెంకటరమణ ప్రసంగించారు. సహకార ఉద్యమం అనేది 19వ శతాబ్దంలో మొదలైందని, బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు, ప్రజలే తమ అవసరాలను తీర్చుకునేందుకు కలిసి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సహకార ఉద్యమం మొదలైందని అన్నారు. మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించారని అన్నారు. సహకార సంఘాలు మన దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ భారతాన్ని ఆత్మ నిర్భరంగా మార్చేడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ స్థాయిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి రంగాల్లో సహకార సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని వెంకట రమణ చెప్పారు.
అర్బన్ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు మాట్లాడుతూ , ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి – కలిసి ప్రయోజనం పొందాలి” అన్నది సహకార రంగం యొక్క మూలమని ముఖ్య అతిధి ఇన్నీసుపేట తెలిపారు. సహకార సంఘం లాభాపేక్ష కంటే సభ్యుల సంక్షేమాన్ని ముఖ్యం చేసే వ్యవస్థ అని అన్నారు. పాల సంఘాలు, మత్స్యకార సంఘాలు, కార్మిక సహకార సంఘాలు, రుణాలు ఎరువులు సరఫరా చేసే ప్యాక్స్ లు, మార్కెటింగ్, కూలింగ్ సెంటర్లు వంటి రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు సహకార రంగం లో కల్పించబడ్డాయ తెలిపారు. ప్రతి సభ్యుడు ఓటు హక్కు కలిగి ఉండటం ద్వారా పాలనా వ్యవస్థలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందని అయన పేర్కొన్నారు. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నామన్నారు.
జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ అధికారి ఎమ్ .జగన్నాథరెడ్డి మాట్లాడుతూ , నూతన సాంకేతిక ఆవిష్కరణలు నేపథ్యంలో సహకార సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకొని, డిజిటలైజేషన్, మొబైల్ బ్యాంకింగ్, డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ప్రగతి సాధించాలని అన్నారు.
యువతను సహకార ఉద్యమంలో చేర్చుకుని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా సేవలను అందించాలని విభాగ సహకార అధికారి ఎమ్ .కనకదుర్గారెడ్డి సూచించారు.
సహకార వ్యవస్థ సామూహిక శ్రమ, సమష్టి అభివృద్ధికి ప్రతీక అని, చిన్న రైతులు, వాణిజ్యవ్యవస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థులు వంటి అనేక వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతు ఇచ్చే కీలకమైన ప్లాట్‌ఫాం సహకార సంస్థలని, ఫలితం గా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక శక్తి పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీ రుణాల ద్వారా రైతులు, చిన్న వ్యాపారులకు మద్దతు లభిస్తుందని, సరసమైన ధరకే వినియోగ వస్తువుల సరఫరా అవుతుందని, సభ్యుల్లో సమానత్వ భావన, పాలనలో పారదర్శకత పెంపు, స్వయం సహాయకత, స్వయం పాలనకు ప్రోత్సాహం సంఘాల ద్వారా సాధ్యమని సమావేశం లో పాల్గొన్న ఆర్యాపురం అర్బన్ బ్యాంకు సీఈఓ జీ . సుధాకరరావు, జాంపేట అర్బన్ బ్యాంకు సీఈఓ ఎమ్ .విజయ ప్రతాప్ తెలిపారు.
తొలుత ర్యాలీలో జిల్లా సహకార సంస్థల సిబ్బంది, సహకార శాఖ అధికారులు, ఉద్యోగులు మరియు వివిధ సహకార సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వద్ద సహకార పతాకావిష్కరణ చేసి సమావేశం నిర్వహించారు.
Prajavartha Online Telugu News