-ఆకట్టుకున్న ఆదివాసీ సంప్రదాయ నృత్య ప్రదర్శన
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిని నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయులు కలిగిన వారు ఆదివాసీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం వేడుకలకు ఇంచార్జీ జిల్లా ట్రైబుల్ అధికారి బి. శశాంక అధ్యక్షత వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కొమరం భీమ్, బిర్సా ముండ, ఏకలవ్యుడు చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు నిలువుటద్ధంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతమన్నారు. ఆదివాసీలు నేటికీ అనేకరంగాల్లో వెనకబాటులోనే ఉన్నారని, విద్య ద్వారానే నాగరిక సమాజంలో కలిసి తమ హక్కులను ఉనికిని కాపాడుకో గలుగుతారన్నారు. కావున చిన్ననాటి నుంచే గిరిపుత్రులు తగిన లక్ష్యాలను నిర్దేశించుకొని.. అందుకు తగ్గ సాధన, శ్రమ ద్వారా వాటిని చేరాలని ఆయన ఆకాంక్షించారు. అప్పుడే మీ నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. శ్రమ విషయంలో దృష్టి పెట్టాలని, తద్వారా పారిశ్రామికంగాను రాణిస్తారని మాట్లాడారు. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని అడవి తల్లిని వేడుకొన్నారు.
*అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు మాట్లాడుతూ గిరిజనులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీల పాత్ర, కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఏజెన్సీలో తాను విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆదివాసులతో తనకి మంచి అనుబంధం ఏర్పడిందని అదనపు ఎస్పీ అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా సందర్భంగా 20 మంది ఆదివాసీలను ఘనంగా దుశ్శలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ.వి. సుబ్బరాజు, ఇంచార్జీ జిల్లా ట్రైబుల్ అధికారి బి. శశాంక, డిప్యూటీ డెవలప్మెంట్ కన్సిస్టెన్సీ రేణుక నాయక్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఎస్. టి. నాయకులు.కుర్ర శ్రీనివాస్ రావు, కప్ప సత్తి వెంకట రమణ, దేవర రాముడు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, కె.నారా యణ రావు, ఎన్. టి. ఎఫ్. ఉపాధ్యక్షులు, గరికపాటి సురే ష్ మాస్టర్, ఎన్. టి. ఎఫ్. అధ్యక్షులు, జ్యుడీషియల్ డిపార్ట్మెంట్, మానుపాటి రమేష్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎస్.ఎస్. చంద్ర, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె. సాంభుడు, ప్రధానో పాధ్యాయులు, ఇందిరా ప్రియ దర్శిని విద్యార్థులు తదితరు లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News