-ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
-యువతను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
-విజన్ -2047 లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
-ప్రతి ఇల్లు ఆవిష్కరణల కేంద్రంగా మారాలి: బూరుగుపల్లి శేషారావు
-ఆవిష్కరంద్ర ప్రతిజ్ఞ చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆర్టీఐహెచ్ ప్రతినిధులు…
-ప్రత్యేక ఆకర్షణ గా ఆకట్టుకున్న పారిశ్రామిక , ఇన్నోవేషన్ స్టాల్ల్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రానున్న రోజుల్లో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు అన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆనం కళాకేంద్రం నందు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కర్రి పద్మ శ్రీ, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, లా అండ్ ఆర్డర్ బాగుండాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పమని.. ఇందులో భాగంగా ఆవిష్కాంధ్ర దిశగా ఇవాళ తొలి అడుగు పడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసి.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఓ మంచి వేదికగా చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు ఈ ఇన్నోవేషన్ హబ్ దోహదపడుతుందన్నారు. ఈ హబ్ ద్వారా భవిష్యత్తు లో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త పుట్టుకొస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గోదావరి జిల్లాలు వ్యవసాయ ఆధారిత జిల్లాలు అని.. ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా రానున్న రోజుల్లో పారిశ్రామిక రంగంలోనూ గోదావరి జిల్లాలు ముందు వరుసలో నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లు లేక, డీఎస్సీ నోటిఫికేషన్లు రాక యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూర మయ్యారని పేర్కొన్నారు. ఆనాడు యువత డ్రగ్స్ కు విపరీతంగా బానిసలుగా మారడంతో రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవిష్కాంధ్రప్రదేశ్ గా మార్చివేస్తూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రబిందువుగా రాష్ట్రాన్ని మార్చడం జరుగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందిననాడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన పొదుపు సంఘాలు నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసి ఉండేదని.. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనాటి ముందుచూపుతో రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయని గుర్తుచేశారు. సాఫ్ట్ వేర్ అంటే పూనే, చెన్నై, బెంగుళూరు అనుకునే రోజుల్లో.. వాటన్నింటినీ మించి సైబరాబాద్ ను సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. పాలకొల్లు నుంచి విశాఖ వెళ్లాలంటే ఒకప్పుడు 14 నుంచి 18 గంటల సమయం పట్టేదని.. కానీ ఆనాడు వాజ్ పేయి గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ హైవేలు నిర్మించడంతో కేవలం 5 గంటల్లోనే ప్రయాణం చేయగలుగుతున్నామని మాట్లాడారు. ఇలా ఓ విజన్ తో చంద్రబాబునాయుడు గారు చేసే ఆలోచనలు.. పదేళ్ల తర్వాత ప్రజలకు మంచి ఫలాలు అందిస్తుంటాయని చరిత్రనే చెబుతోందన్నారు. అలాగే ఈ ఆవిష్కాంధ్ర కూడా భవిష్యత్తులో మంచి ఫలాలు అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మంత్రివర్యులు పేర్కొన్నారు.
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా మలిచేందుకు ఈ ఇన్నోవేషన్ హబ్ నాంది పలుకుతుందన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధనలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఓ మైలు రాయిగా అభివర్ణించారు. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రతి కుటుంబాన్ని ఈ కార్యక్రమం శక్తివంతంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. యువత ఉద్యోగాల కోసం వెతికే పరిస్థితి నుంచి.. ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా మార్చడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త యుగం మొదలవు తుందని.. ప్రతి కుటుంబం ఆవిష్కరణల కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడం ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా గతంలో పుట్టుకొచ్చిన డ్వాక్రా సంఘాలు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు దేశానికే వెన్నెముకగా మారాయన్నారు. అలాగే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. మారుతున్న కాలనుగుణంగా మనం కూడా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థినీ భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇవాళ మనం చూస్తున్న నేషనల్ హైవే ప్రాజెక్టులకు పీపీపీ విధానంలో నాంది పలికింది వాజ్ పేయి గారి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫలితంగా దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలతో నేడు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు అవుతుందన్నారు. అలాగే చంద్రబాబునాయుడు గారి విజన్ లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకు వెళుతుందని, నిరుద్యోగ నిర్మూలనకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు గారి ముందు చూపుకు ఆకాశమే హద్దు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విజన్ – 2047 తో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించాలనే తపనతో దేశవిదేశాలన్ని తిరుగుతూ.. మన రాష్ట్రానికి పెట్టుబడులను, పరిశ్రమలను తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కావున యువత చక్కగా చదువుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి విజన్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆవిష్కరణ ఆంధ్ర ప్రతిజ్ఞ
“ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇల్లు ఒక వ్యవస్థాపకుడిని మరియు మార్పుకు దారితీసే వ్యక్తిని పెంచగలదని తెలుసుకుని, నా కుటుంబం యొక్క బలాన్ని నేను నమ్ముతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.”
“నా కుటుంబంలోని ప్రతి సభ్యుడిని కలలు కనడానికి, నేర్చుకోవడానికి మరియు అర్థవంతమైనదాన్ని నిర్మించడానికి ప్రోత్సహిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.”
“నేను నేర్చుకుంటూనే ఉంటానని, ఆసక్తిగా ఉంటానని మరియు నా జ్ఞానాన్ని పంచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను – ఎందుకంటే ఒకరు నేర్చుకున్నప్పుడు, మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది.”
“ఒక కుటుంబం, ఒక వ్యవస్థాపకుడు” అనే కలను సాకారం చేసుకునేందుకు, నా కుటుంబంతో కలిసి, మనం వ్యవస్థాపకులు-ఆవిష్కర్తలు, బిల్డర్లు మరియు ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండటానికి కృషి చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను”.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మ శ్రీ, సోము వీర్రాజు, గ్రీన్ కోర్ చైర్మన్ జీ. రాంబాబు, నన్నయ యూనివర్సిటీ వీసీ వి. ప్రసన్న, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్ కే వి వి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) , ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ శేషారెడ్డి, గెయిల్ ప్రతినిధి కేవీఆర్ రావు, ఓఎన్జిసి ప్రతినిధి కే వి కే రాజు , తాడేపల్లిగూడెం ఎన్ఐటి ప్రతినిధి రవికిరణ్ శాస్త్రి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రతినిధిగా డీన్ డా ఎస్. సూర్య కుమారి., పలు విద్యార్ధిని విద్యార్థులు, ఆర్టీఐహెచ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తొలుత సభ వేదిక కు చేరుకున్న ప్రతినిధులు , అధికారులు ప్రాంగణం లో ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ సందర్శించి, అక్కడ ప్రదర్శించిన వాటిని ఆసక్తిగా గమనించారు..అనంతరం జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేసిన ప్రసంగాన్ని వీక్షించడం జరిగింది.
Prajavartha Online Telugu News