-గంబుసియా చేపల వదిలివేతతో దోమల నియంత్రణ చర్యలు
-డి ఎమ్ హెచ్ వో డా కె వెంకటేశ్వర రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 20, 1897లో సికింద్రాబాద్ పరిశోధన సంస్థలో బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమ జీర్ణాశయంలో ప్లాస్మోడియం పరాన్నజీవిని గుర్తించారు. ఈ ఆవిష్కరణ గౌరవార్థం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె వెంకటేశ్వర రావు తెలిపారు. బుధవారం ఉదయం రాజవోలు గ్రామంలో చెరువులో గంబుసియా చేపల వదిలివేత కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి శ్రీమతి ఏ. జ్ఞానశ్రీ మరియు సిబ్బంది కలిసి సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జిల్లాలోని చెరువులు, నీటి గుంటల్లో మూడు లక్షల యాభై వేల గంబుసియా చేపలను వదిలి దోమల అభివృద్ధిని నియంత్రించే కార్యక్రమం చేపట్టారు. మలేరియా వ్యాధి పరిశోధనలో రాస్ చేసిన కృషి ఫలితంగా అనేక మందులను అభివృద్ధి చేసి అనేక ప్రాణాలను రక్షించడం సాధ్యమైంది. ఆయనకు 1902లో నోబెల్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా “సర్” బిరుదు ఆయనకు మరింత గౌరవం చేకూర్చింది.
ఈ రోజు పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో దోమల వల్ల సంక్రమించే వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఏటా సుమారు 5 లక్షల మరణాలు మలేరియాతో జరుగుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యంతో మలేరియా రహిత భారతదేశం సాధించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ముందుకు అడుగులు వేస్తోంది.
Prajavartha Online Telugu News