-దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 33 వేల కోట్లతో 65 లక్షల మందికి పింఛన్లు
-ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కూటమి అమలు చేస్తోంది
-మంత్రి లోకేష్ హామీ ప్రకారమే మెగాడిఎస్సీ తో పోస్టుల భర్తీ
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలో వైసీపీ నేతలు అసత్యాలు చెబుతూ విష ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న రోడ్లను ప్రారంభించారు. ముందుగా జార్లపాలెం – చెరువుకొమ్ముపాలెం తారురోడ్డును రూ. కోటి వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అలాగే అద్దంకి – కొణికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు రూ.30 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… గత 15 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చూపించిందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అమలు చేయకుండా వదిలేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల పింఛన్ల విషయంలో అసలైన లబ్ధిదారులకు నష్టం కలిగేలా వైసీపీ నేతలు అసత్యాలతో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన దివ్యాంగులు ఎవరికీ పింఛన్లు ఆగలేదని, ఎవరివీ తొలగించలేదని స్పష్టం చేశారు. పింఛన్ల పెంపు విషయంలో రూ.2 వేల నుంచి రూ.3 వేల పెంచడానికి జగన్ కు 5 ఏళ్లు పట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక్క సంతకంతోనే రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ పెంచారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి రూ.33 వేల కోట్లతో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో పింఛన్లను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదలకు ఐదు రూపాయిలకే పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News