-విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు – కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జేసి వై. మేఘా స్వరూప్
-ముగింపు కార్యక్రమంలో దీపావళి టపాసులు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికీ ఉపయుక్తం అవుతాయనీ, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవడం, పన్ను చెల్లింపులో పారదర్శకతతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వ్యాపారులు, వినియోగ దారులు ఇద్దరూ సమానంగా లాభపడే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దు కున్నదని, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్తున్నామని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పేర్కొన్నారు.
ఆదివారం రాజమహేంద్రవరం నగరంలోని పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్లో భాగంగా “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి వై. మేఘా స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రదర్శన కం అమ్మకాల స్టాల్స్‌ను సందర్శించారు.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గత నెల రోజులుగా “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వెళ్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందించడానికి దోహదపడుతున్నాయని తెలిపారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మందులు, మిల్క్ ప్రొడక్ట్స్ తదితర విభాగాల్లో పన్నుల్లో తగ్గింపుతో ప్రజలకు లబ్ధి కలుగుతోందని వివరించారు. జిల్లాలో తయారవుతున్న స్థానిక ఉత్పత్తులకు విలువ ఆధారిత సేవలు (Value Added Services) జోడించి వాటిని బ్రాండ్ రూపంలో మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జ్యూట్ బ్యాగ్స్, చేనేత వస్త్రాలు, వంట ఉత్పత్తులు వంటి వాటిని ప్రదర్శనలో ఉంచి విక్రయించే సదుపాయాలు కల్పించామని చెప్పారు.
కడియం ప్రాంతంలో పూల వ్యర్థాలతో అగరబత్తులు తయారు చేస్తున్న మహిళా సంఘాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని దేవాలయాల ద్వారా మార్కెటింగ్ చేయడానికి అవకాశం కల్పించామని వివరించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 సంస్కరణలు వలన పన్నుల పారదర్శకతతో పాటు ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. బిల్లులు తీసుకోవడం ద్వారా పన్నుల్లో పడే భాగస్వామ్యం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రతి వినియోగదారుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జనరిక్ మందుల వినియోగంపై అవగాహన పెంపు, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా – మేకింగ్ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ నోడల్ అధికారి వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పై గత నెల రోజులుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. టీవీలు, ఏసీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్ల వంటి ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుతో ₹5,000 నుంచి ₹15,000 వరకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. జీఎస్టీ అంశాలపై టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు.
వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ బి. సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 4,300 అవగాహన కార్యక్రమాలు చేపట్టి, జీఎస్టీ చాంపియన్లు ప్రతి ఇంటికి వెళ్లి ధరల్లో వ్యత్యాసాలపై వివరాలు అందించారని తెలిపారు. ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం, వినియోగదారుల్లో అవగాహన పెంపుతో ఆర్థిక లావాదేవీల పారదర్శకత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ (ST) ఎం. సుధాకర్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ టీవీ. నాగేశ్వరరావు, జీఎస్టీ అధికారి హుస్సేన్ షరీఫ్, డిప్యూటీ ఏసీ కె. సురేష్ కుమార్, సిపిఓ జెడి, జిల్లా జీఎస్టీ కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ వై. అప్పలకొండ, అడిషనల్ ఎస్పీ ఏ.వి. సుబ్బరాజు, పిడి డి ఆర్డిఏ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దా మణి, తదితరులు పాల్గొన్నారు.
లక్కీ డిప్ విజేతలు / బహుమతులు
మొదటి బహుమతి (మిక్సీ గ్రైండర్) – వల్లీ (కొవ్వూరు), తనూజ (రాజమహేంద్రవరం), వీ.టి. శ్రీనివాస్
రెండవ బహుమతి (ఎలక్ట్రిక్ కుక్కర్) – కె. చిన్ని, డి. దుర్గా భవాని, పి. లక్ష్మీ దివ్య
మూడవ బహుమతి (కుక్కర్) – ఎన్. జోగేశ్వరరావు, యూ. రామలక్ష్మి, ఎమ్. అనంతరెడ్డి
ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేయబడినాయి.
Prajavartha Online Telugu News