Breaking News

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం..

-ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా పకడ్బందీ చర్యలు..
-మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారుల సమన్వయంతో జిల్లాలో మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మంగళవారం మధ్యాహ్నం మంత్రి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొంథా తుపాను జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండి, కాట ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలసి తుపాను ప్రభావంతో జిల్లాలో సంభవించనున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు.

తీరం దాటే సమయంలో అధిక వర్షాలు కురిసినప్పుడు నగరంతోపాటు పంట పొలాలకు ముంపు ప్రభావం తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ప్రధాన డ్రైనేజీలు అయిన శివగంగ, గుండేరు, లజ్జబండ మురుగు కాలవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల కట్టలను బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాయశక్తులా కృషి చేయాలని అధికారులను కోరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం కాకినాడ మధ్య మొంథా తుపాను తీరం దాటనున్నదని తెలుపుతూ, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు తుఫాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో కూడా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి జిల్లా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లాలో ఇప్పటికే దాదాపు 165 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 6 వేల మందికి పైగా ప్రజలకు పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ తుపాను వల్ల సుమారు 16 వేల మందికి పైగా ప్రభావం చూపే అవకాశం ఉందని, మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. ఈ విపత్తు వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రక్షణ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతూ, ప్రజలందరూ దీనిని దృష్టిలో పెట్టుకొని సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని కోరారు.

జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి మాట్లాడుతూ తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, మురుగు కాలువలు పొంగిపొర్లకుండా అడ్డంకులు తొలగించడం, విద్యుత్ స్తంభాల కూలిపోతే పునరుద్ధరించడం, రహదారులు కొట్టుకుపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో లోతట్టు ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారికోసం 165 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి 6,618 మంది ప్రజలను తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఇంకా రావలసిన వారిని కూడా తరలించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఆలోపుగానే అవసరమైన నిత్యవసర సరుకులతోపాటు పిల్లలకి అవసరమైన పాలు, పండ్లు, ఔషధాలు, సరిపడ తాగునీరు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పాడవకుండా ఉండేందుకు స్విచ్లు ఆఫ్ చేసుకోవాలని సూచించారు. తుపాను వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన వెంటనే పరిస్థితులను పునరుద్ధరించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశామని, మొత్తంగా తుఫాను పరిస్థితులను అధిగమించేందుకు అన్ని విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పి సత్యనారాయణ, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఛైర్మన్‌ బండి రామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *