కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను రక్షణ, సహాయ చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని తీర, లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న 35,114 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు.
మంగళవారం సాయంత్రం వరకూ కాకినాడ జిల్లాలో చేపట్టిన మొంథా తుఫాను రక్షణ, సహాయ చర్యలపై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేసారు. తుఫాను ప్రభావానికి జిల్లాలో 12 మండలాల్లోని 68 గ్రామాలు, 5 పట్టన ఆవాసాలల్లో 41,729 మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారని, ఇప్పటి వరకూ 35,114 మందిని సురక్షిత ప్రదేశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, త్రాగునీరు, ఇతర కనీస వసతులు కల్పించామని తెలిపారు. మొత్తం 401 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు సిద్దం చేసి ఇప్పటి వరకూ 81 కేంద్రాలను తెరిచామని, తుఫాను తాకిడికి గురికాగల ప్రాంతాలు, పూరి గుడిసెలు, బలహీన గృహాలలో నివశిస్తున్న ప్రజలను ఈ పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రజలకు 45,700 ఆహార ప్యాకెట్లు, 2,463 వాటర్ కేన్లు పంపిణీ చేసామని, 24 టాంక్లర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే 1,50 లక్షల లీటర్ల పాలు సరఫరాకు మిల్క్ సప్లయర్లను, 16 మంది బ్రెడ్ వెండర్లు, 191 మంది ఫుడ్ సప్లయర్లను గుర్తించామన్నారు. ఐసిడిఎస్ ద్వారా 1400 మంది బాలింతలకు, 21,459 మంది చిన్నారులకు పాలు, గుడ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 259 మెడికల్ క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టామని, 185 మంది వైద్యులు, 1710 మంది వైద్య సిబ్బంది, ఇరవై మూడు 108 ఆంబులెన్సులు, ముప్పై ఐదు 104 సంచార వైద్య వాహనాలను, ఇరవై రెండు 102 వాహానాలను ఈ సేవలకు నియోగించామని తెలిపారు. అలాగే 7150 యాంటీ రాబీస్ వాక్సీన్, 1773 యాంటీ స్నేక్ వెనమ్ డోసులు, 2.50 లక్షల క్లోరీన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ముందు జాగ్రత్తగా 95 మంది గర్భిణులను, 1400 మంది బాలింతలను 52 ఆసుపత్రులకు, సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య పర్యవేక్షణలో ఉంచామన్నారు. పాఠశాలలన్నికి శెలవులు ప్రకటించామని, హాస్టళ్లలో చదువుతున్న 14,499 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపామని తెలిపారు.
లోతట్టు ప్రాంతాలలోని 9901 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 52 మంది పశువైద్యులతో 30 పశువైద్య శిభిరాలు ఏర్పాటు చేసి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 17 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచామన్నారు. సముద్ర వేటవలో ఉన్న బోట్లన్నిటినీ తీరానికి రప్పించామని, 4,573 బోట్లు కొట్టుకుపోకుండా ఉప్పుటేరు, క్రీక్ లలో ఉంచుకోవాలని మత్స్యకారులకు సూచించామని తెలియజేసారు.
జిల్లా, డివిజన్ కేంద్రాలతోబాటు 21 మండలాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేసి తుఫాను పరిస్థితిని, సహాయ పునరావాస కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసామన్నారు.
తుఫాను సహయక చర్యలలో 85 విహెచ్ఎఫ్ సెట్లు, తాళ్లరేవు, యు.కొత్తపల్లి లలో 2 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను పటిష్టం చేసామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 30, 24 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 50 మంది సభ్యులతో ఒక ఎస్డిఆర్ఎఫ్ బృందం చేరుకుని రక్షణ, సహాయక సేవలందించేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే అత్యవసర సేవల కోసం 214 మంది గజఈత గాళ్లను నియమించామని, 100 మంది సిబ్బంది, 50 వేల లీటర్ల డీజిల్ తో 60 బోట్లను సిద్దం చేసామని తెలిపారు. కాకినాడ అర్బన్, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిపాడ్లు ఏర్పాటు చేశామన్నారు.
తుఫాను కారణంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ఎదురైయ్యే అంతరాయాలను, నష్టాలను ఎప్పటికప్పుడు పునరుద్దరించేందుకు 47 క్రేన్లు, 124 జనరేటర్లు, 66 ఫోర్క్ లిఫ్ట్ లు, 99 ఎస్కవేటర్లు, 28 రోడ్డు రోలర్లు, 26 ఫైర్ టెండర్లు, 4 డంపర్లు 12 హార్వెస్టర్లు అందుబాటులో ఉంచామని, సహాయ పునరావస కార్యక్రమాలకు 1602 పాఠశాల బస్సులు, 28 గూడ్స్ కారియర్లు, 907 ట్రాక్టర్లు, 3336 ట్రైలర్లను రంగంలో ఉంచామన్నారు. ఆర్ అండ్ బి శాఖ ద్వారా 13 జేసీబీలు, 23 పవర్ రంపాలు, 23 ట్రాక్టర్లు అవరోధాల తొలగింపుకు వినియోగిస్తున్నామన్నారు. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా 1.33 లక్షల కేజీల బ్లీచింగ్ పౌడరు, 3.27 కేజీల లైమ్, 1018 లీటర్ల సోడియం క్లోరేట్, 1535 లీటర్ల ఫినాయిల్ సిద్దంగా ఉంచామన్నారు.
అగ్నిమాపక శాఖకు చెందిన 199 మంది సిబ్బంది, 42 వుడ్ కటింగ్ బృందాలు, 44 లైఫ్ జాకెట్లు, 44 లైఫ్ బోట్లు, ఇతర రక్షణ సామగ్రి సిద్దంగా ఉంచడం జరిగిందన్నారు. పోలీస్ ద్వారా 34 క్రేన్లు, 3 డ్రోన్లు, 121 అస్కాలైట్లు, 86 డ్రాగన్ లైట్లు, 395 రైన్ కోట్లు, 78 లైఫ్ జాకెట్లు, 20 మొబైల్ సెట్లు, 96 ట్రాక్టర్లు రంగంలో ఉంచారన్నారు. ప్రమాద కరమైన రూట్లలలో 44 ఆర్టీసీ బస్సులు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
విద్యుత్ సరఫరా అంతరాయాలను ఎప్పటికప్పుడు పునరుద్దరించేందుకు 3 వేల స్థంబాలు, 44 క్రేన్లు, 33 ప్రయివేట్ వాహనాలు, 11 జేసీబీలు, 41 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 45 జనరేటర్లు, 55 పవర్ రంపాలు, 526 కండక్టర్లు, 245 ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉంచి 1000 మంది సిబ్బందిని, కార్మికులను సంసిద్ధంగా ఉంచామన్నారు.
ఇరిగేషన్ శాఖ ద్వారా గండ్లు ఎప్పటికప్పుడు పూడ్చేందుకు 30 వేల ఇసుక బస్తాలను, 11 జేసీబీలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
పౌర సరఫరాల శాఖ ద్వారా 49269 టన్నులు ఫోర్టఫైడ్ బియ్యం, 9.81 టన్నుల బెల్లం, రాగి పిండి, 296 టన్నుల పంచదార, 30185 నూనె పాకెట్లు, మార్కెటింగ్ శాఖ ద్వారా 10 టన్నుల ఉల్లిపాయలు, బంగాళాదుంప లు, 12 టన్నుల టమోటా పౌరసరఫరాల శాఖ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు.
తుఫాలను ప్రభావం వల్ల మంగళవారం సాయంత్రం వరకూ అక్కడక్కడా చెట్లు కూలడం మినహా అవాంఛిత సంఘటనలేమి నమోదు కాలేదని, కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి ఆరు 33కెవి పోల్స్, ఇరవై తొమ్మిది 11 కేవీ పోల్స్, 16 ఎల్టీ పోల్స్, 1.19 కిమీ పొడవు 11 కెవి కండక్టర్, 2 ట్రాన్స్ ఫార్మర్లకు నష్టం వాటిల్లాగా విద్యుత్ సిబ్బంది యుద్దప్రాతిదికన వాటిని చక్కదిద్ది సరఫరా పునరుద్దరించారని తెలిపారు. అలాగే ఏలేరు ఉదృతి కారణంగా సాగునీటి వ్యవస్థలలో 6 చోట్ల గండ్లు పడ్డాయని కలెక్టర్ తెలిపారు.
ప్రజా రక్షణకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టామని, ప్రజలు ఎటు వంటి ఆందోళనలకు లోను కాకుండా ఈ రక్షణ, సహాయ కార్యక్రమాలకు సహకరించాలని, తుఫాను సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ లకు వెంటనే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తమ ప్రకటనలో కోరారు. సురక్షిత ప్రదేశాలలో ఉండి, తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని, పెనుగాలులలోను, తుపాను తీరం దాటే సమయంలోను చెట్లు, స్థంబాల వద్ద, ఆరుబయట సంచరించ వద్దని కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News