గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ – 2025 కార్యక్రమాన్ని గుంటూరులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. రమేష్ చంద్ర, స్వచ్ఛత మరియు సమాజం మధ్య వారధిగా ఉండాలని నర్సింగ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారత్ బహిరంగ మల విసర్జనరహిత (ODF) దేశంగా అవతరించడంలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆంగన్‌వాడీ సిబ్బంది చేసిన కృషి కీలకమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛతా లక్ష్యాలను సాధించేందుకు ఆరోగ్య వృత్తి నిపుణులు మార్పు దూతలుగా వ్యవహరించి, స్థానిక భాగస్వాములతో సమన్వయం సాధించాలని ఆయన సూచించారు. పారిశుధ్య మౌలిక వసతుల అభివృద్ధి, అవగాహన పెంపుతో పాటు, వ్యర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం, లింగసున్నిత పారిశుధ్య – ఆరోగ్య అంశాలలో ఇంకా మెరుగు పరచవలసిన అంశాలను గుర్తించి, స్థానిక అధికారులతో కలిసి స్వచ్ఛత, సమాజ గౌరవాన్ని పెంచడంలో కృషి చేయాలని రమేష్ చంద్ర కోరారు.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వేమూరి వసుంధర మాట్లాడుతూ, తరగతి గదులు, హాస్టళ్లలో, కళాశాల ఆవరణ పరిసరాలలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కోసం చేపట్టిన చర్యలను వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనకు కళాశాల కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
గుంటూరులో రెండు రోజులపాటు సాగిన స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా, సీబీసీ గురువారం లామ్‌లోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛతా ప్రతిజ్ఞ మరియు అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాలను నిర్వహించింది. చదువులో ప్రతిభ, స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు సీబీసీ బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. విద్యార్థులు స్వచ్ఛతా ప్రతిజ్ఞతో పాటు తమ విద్యాసంస్థ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుండి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా – 2025 కార్యక్రమాల క్రమంలో, సీబీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సంస్థల్లో దాదాపు 30 కార్యక్రమాలను నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు స్వచ్ఛత అవగాహన కల్పించింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) యూనిట్లు, మేరా యువ భారత్ వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా కళా బృందాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వచ్ఛతే సేవ – 2025 సందేశాన్ని ప్రభావంతంగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి కృషి చేశారు.
Prajavartha Online Telugu News