-భారతమహిళల బ్లైండ్ క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల టి20 బ్లైండ్ ప్రపంచకప్ ఫైనల్లో నేపాల్‌పై భారత మహిళల జట్టు సాధించిన విజయం దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈమేరకు భారతమహిళల బ్లైండ్ క్రికెట్ టీమ్ కు ఏసీఏ తరుఫున అభినందనలు తెలుపుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొలంబో లో ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని మరోసారి నిలబెట్టిందని పేర్కొన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం పి. కరుణకుమారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయం దేశ యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
“శారీరక ప్రతిబంధకాలను పక్కనపెట్టి అసాధారణ పోరాటస్ఫూర్తి, కృషి, సంకల్పబలం ప్రదర్శించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల బ్లైండ్ క్రికెట్ టీమ్ నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపింది. క్రీడాకారిణులను ప్రోత్సహించిన కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక శుభాభినందనలు. మహిళల శక్తి, ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి ఈ విజయం నిదర్శనం. భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టుకు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను.“ అని ఏసీఏ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
Prajavartha Online Telugu News