-ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధి గుణదల ప్రాంతానికి నూతన పోలీస్ స్టేషన్ మంజూరైనట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ దృష్ట్యా.. పౌరులకు తక్షణ సేవలను అందించేందుకు గానూ నూతన పీఎస్ ఆవశ్యకత ఉందన్నారు. కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ప్రజలకు మరింత సేవలందించే అవకాశం ఉందన్నారు. గతంలో 2009-14 మధ్య శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో సింగ్ నగర్ కు నూతన పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయించినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం హోం శాఖ బుధవారం జీవో నెం. 113 ను జారీ చేసినట్లు తెలియజేశారు. నగరంలో సమర్థవంతమైన, స్నేహపూర్వక పోలీసింగ్ ఏర్పాటుకు ఈ నూతన స్టేషన్ దోహదపడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గడిచిన రెండేళ్లల్లో నగరంలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని.. రానున్న రోజుల్లో నేర రహిత నియోజకవర్గంగా సెంట్రల్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. నగరంలో నేరగాళ్లకు స్థానం లేదని మరోసారి హెచ్చరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సమస్త సౌకర్యాలు ఉండేలా త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తామని తెలియజేశారు.