-రాజకీయాలను వైసీపీ భ్రష్టుపట్టించింది
-తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దూషణలు, దాడులు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయాలను భ్రష్టుపట్టించిందని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత తిరుమల లడ్డును కూడా కల్తీ చేసిన కల్తీ పార్టీ వైసీపీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఆదివారం నాడు ఒంగోలులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సహచర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే రోడ్లపైకి వచ్చి బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలను కావాలనే వైసీపీ నాయకులు రెచ్చగొట్టి సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆరోపించారు. అయినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News