జనాగ్రహ దీక్షలను భగ్నం చేసేందుకు చంద్రబాబు కుట్ర…

-పట్టాభి నాయకుడు కాదు… ఒక పెయిడ్ ఆర్టిస్ట్ : ఎంపీ మోపిదేవి వెంకటరమణ
-డ్రగ్స్, గంజాయి పేరుతో ఏపీ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు యత్నం
-జనాగ్రహ నిరసన దీక్ష ముగింపు సభలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు ఏర్పాటు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి అనుచిత వ్యాఖ్యలను పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. విజయవాడ కంట్రోల్ రూం సమీపంలోని వైఎస్సార్ పార్కు వద్ద జరిగిన జనాగ్రహ నిరసన దీక్ష ముగింపు సభలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాభి నాయకుడే కాదని.. అతను చంద్రబాబు ఏర్పాటు చేసిన ఒక పెయిడ్ ఆర్టిస్ట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజస్వరూపం రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసన్నారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి.. పట్టాభితో  ముఖ్యమంత్రివర్యులను దుర్భాషలాడించిన వరకు చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు చేపట్టిన జనాగ్రహ దీక్షలను భగ్నం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇంత జరిగినా సిగ్గులేకుండా ఇంకా పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్ ని చంద్రబాబు దగ్గరుండి తిట్టిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్నది నాయకులు కాదని.. కేవలం రౌడీలు, గూండాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. టీడీపీకి దమ్ముంటే బద్వేలులో పోటీ చేయవచ్చు కదా..? అని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో పాలన బాగుందని దేశం మొత్తం కీర్తిస్తుంటే.. చూసి భరించలేక బురద చల్లే కార్యక్రమాలను చేపడుతున్నారని మండిపడ్డారు. గుడ్ గవర్నెన్స్ లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని.. కనుకనే పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడి సంక్షేమ పథకాలను అనుకరిస్తున్నారన్నారు. అటువంటి ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా గంజాయి, డ్రగ్స్ అంటూ దుష్ప్రచారం చేస్తారా..? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటిని అడ్డుకుంటుందని హెచ్చరించారు.

కుటుంబసమేతంగా తిరుమల వచ్చిన అమిత్ షాపై దాడి చేయించిన చంద్రబాబు అప్పుడే మర్చిపోయారా..? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలో అడుగు పెట్టడానికి వీళ్లేదని గతంలో చంద్రబాబు చెప్పలేదా..? ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ప్రతిపక్షనేత ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలుస్తారు..? అని చంద్రబాబును మల్లాది విష్ణు ప్రశ్నించారు. మరోవైపు పోలీస్ యంత్రాంగంపై అభాండాలు మోపుతూ.. ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు. పోలీసుల మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంటే చూసి భరించలేక చంద్రబాబు దుష్ట రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత కుట్రలను తిప్పి కొట్టేందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మజ్జిగ పంచి మహిళలచే దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్సీసా, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ , APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి , జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గ, విజయవాడ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, నగర వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *