గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి తక్కెల్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ తర్వాత ప్రధానమైన త్రాగునీటి సరఫరా కేంద్రమైన సంగం జాగర్లమూడి పంపింగ్ పాయింట్ నుండి పూర్తి సామర్ధ్యంతో నగరానికి త్రాగునీటి సరఫరా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం సంగంజాగర్లమూడిలోని జిఎంసి ఫిల్టరేషన్ పాయింట్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జాగర్లమూడి పంపింగ్ స్టేషన్ పూర్తి సామర్ధ్యం, త్రాగునీటి ట్రీట్మెంట్ విధానం, ల్యాబ్, క్లోరిన్ మిక్సింగ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రస్తుత నీటి లెవల్ వివరాలు అడిగి తెలుసుకొని, ప్లాంట్ ని తనిఖీ చేసి, మాట్లాడుతూ ప్లాంట్ పూర్తి సామర్ధ్యంతో పని చేయాలన్నారు. ప్లాంట్ లో ల్యాబ్ సిబ్బంది విధులు తనిఖీ చేసి, ట్రీట్మెంట్ అనంతరం షిఫ్ట్ ల వారీగా ప్రతి రోజు శ్యాంపిల్స్ తీసి ఏపిసిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. క్లారిఫైర్ 24/7 పని చేయాలని, సంప్ ల క్లీనింగ్ ని ఫోటోలతో రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. క్లోరిన్ శ్యాంపిల్స్ ని పరిశీలించి, నిర్దేశిత ప్రమాణంలో క్లోరిన్ ని మిక్స్ చేయాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వ వివరాలు అడిగి, కొమ్మమూరు కెనాల్ కి సరఫరా జరిగే సమయంలో ట్యాంక్ ని నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్ లో సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏఈ, డిఈఈలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే సిబ్బందితో పాటు పర్యవేక్షణ అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో 5 వందల కిలోవాట్స్ సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ని పరిశీలించి, ప్లాంట్ ని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు. సోలార్ ప్యానల్స్ పూర్తి సామర్ధ్యంతో పని చేసేలా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ సతీష్ కుమార్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News