గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుంటూరు నగరాన్ని స్వచ్ఛమైన మరియు హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, పునర్వినియోగం చేసేందుకు ప్రత్యేక సేకరణ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని ఈ-వేస్ట్ రహిత నగరంగా తీర్చిదిద్దుకోవడంలో నగర ప్రజలు స్వచ్చందంగా పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. సాధారణంగా గృహాలు, కార్యాలయాలు మరియు వాణిజ్య సంస్థల నుండి వచ్చే పాడైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, బ్యాటరీలు మరియు వైర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల వాటిలోని హానికర రసాయనాలు పర్యావరణంలో కలిసి తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. ఈ ముప్పును నివారించేందుకు ప్రజలందరూ తమ వద్ద ఉన్న ఈ-వేస్ట్‌ను వేరుగా నిల్వ చేసి, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వచ్చే ప్రత్యేక వాహనానికి మాత్రమే అప్పగించాలని కోరారు. మీ ప్రాంతంలో ఈ-వేస్ట్ ఎక్కువగా ఉండి వాహనం అవసరమైనా ప్రజలు వెంటనే జిఎంసి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 0863-2345103 కు సంప్రదించవచ్చని సూచించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకొని, వ్యర్థాల రీసైక్లింగ్‌కు సహకరిస్తూ భావి తరాలకు కాలుష్య రహిత నగరాన్ని అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
Prajavartha Online Telugu News