-మద్యం వ్యాపారంలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వబోం
-గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను అడ్డం పెట్టుకుని జేబులు నింపుకున్నారు
-జగన్ రెడ్డి తన సొంత మద్యం బ్రాండ్లతో వేలాది మంది ప్రాణాలు తీశారు
-ఎక్సైజ్ సురక్ష, ట్రాక్ అండ్ ట్రేస్ వంటి విధానాలతో ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎక్సైజ్ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎక్సైజ్ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి తొలుత మద్యం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంపిల్స్ పరిశీలించారు. అనంతరం మద్యం షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపు స్టాక్ రికార్డుల్ని తనిఖీ చేశారు. ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా బాటిళ్లను స్కాన్ చేసి వివరాలను పరిశీలించారు. షాపుకు వచ్చిన మద్యం కొనుగోలు దారులతో మాట్లాడి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించాం. గత ఐదేళ్లు ప్రభుత్వ మద్యం షాపుల పేరుతో కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. సొంత బ్రాండ్లను అమ్మకంతో జేబులు నింపుకున్నారు. క్వాలిటీకి తిలోదకాలిచ్చి కల్తీ మద్యాన్ని అమ్మారు. ఫలితంగా గత ఐదేళ్లలో సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది కిడ్నీ, లివర్ సమస్యలతో ఇప్పటికీ ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు.
అందుకే మద్యం అమ్మకాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు, కర్నూలు, గుంటూరులో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ENA నుంచి డిస్టిలరీ, బాటిలింగ్ వరకు అన్ని చోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నాం. బ్యాచ్‌ల వారీగా పరీక్షించిన తర్వాతే షాపులకు తరలిస్తున్నాం. ప్రతి బ్యాచ్ వారీగా పరీక్షించి, మద్యంలో ఎలాంటి రసాయనాలున్నాయనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వైసీపీ హయాంలో ఏడాదికి సగటున 14 వేల శాంపిల్స్ పరీక్షిస్తే.. ప్రస్తుతం ఏటా నెలా 30 వేలకు పైగా శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నాం. ఫలితంగా నాసిరకమైన మద్యం కనిపించకుండా చేశాం.
గత ఐదు సంవత్సరాలు నాణ్యమైన మద్యం బ్రాండ్లను తరిమేసి, కల్తీ బ్రాండ్లను తీసుకొచ్చారు. ఫలితంగా బీర్లు, మద్యం అమ్మకాలు పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుండి ఏపీకి మద్యం తరలింపు భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ లావాదేవీలు 1శాతం కూడా లేకుండా మొత్తం క్యాష్ అండ్ క్యారీ విధానంలో జరిపి తాడేపల్లి ప్యాలెస్ నింపుకున్నారు. కానీ నేడు రాష్ట్రంలో సుమారు 40 శాతానికి పైగా లావాదేవీలు డిజిటల్ పేమెంట్ల రూపంలోనే జరుగుతున్నాయి. గతంలో మద్యం షాపులకు ఇండెంట్లు మొత్తం వారికి నచ్చినట్లు చేశారు. డిక్టేటర్ షిప్ కారణంగా కల్తీ మద్యానికి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. కానీ నేడు ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై విధానం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడంతో పాటుగా, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. నాటు సారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించాం. సామాన్యుల కోసం రూ.99 అందుబాటులోకి తీసుకొచ్చాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. ఉద్దేశ్యపూర్వకంగా మొలకలచెరువు, ఇబ్రహీపట్నంలో కల్తీ మద్యం తయారు చేసి అమ్మేందుకు ప్రయత్నించి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టారు. కల్తీకి అవకాశమే లేకుండా ఎక్సైజ్ సురక్ష యాప్ కూడా తీసుకొచ్చాం. ఆ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌ను ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటుగా, తయారీ నుండి ప్రతి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాం. ఏ దశలో కూడా తప్పు జరగడానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నాం. టైమింగ్స్, ఎమ్మార్పీ విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులకు కీలక ఆదేశాలిచ్చాం.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను అవసరం మేరకు మరిన్ని పెంచేలా సన్నాహాలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా.. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడి మద్యంతో పోలిస్తే ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండడంతో.. సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు కూడా 30-50 శాతం వరకు పెరిగాయి. జగన్ రెడ్డి హయాంలో దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. విచారణ పారదర్శకంగా జరుగుతోంది. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి మద్యం షాపులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఏ షాప్ ఎప్పుడు తెరుస్తున్నారు, ఎప్పుడు మూస్తున్నారో పరిశీలించడం లక్ష్యంగా ఎక్సైజ్ ఐ యాప్ అందుబాటులో ఉంచాం. ఎక్కడైనా తప్పు జరిగినట్లు గమనిస్తే ప్రజలు స్వచ్చందంగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News