Breaking News

2027 మహా పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం

-సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్.. పుష్కరాలకు కొత్త శోభ
-మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల బృందం వెల్లడి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అఖండ గోదావరి మహా పుష్కరాలు–2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతోందనీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు మరియు ఇతర విద్యుత్ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మేఘాస్వరూప్ తదితరులు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో విస్తృత సంస్కరణలు చేపట్టి, పగడ్బంది ప్రణాళికతో వినియోగదారులకు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఒక్కరోజులోనే రూ.485 కోట్ల వ్యయంతో 8 పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తుచేశారు. గతంలో ట్రూఅప్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపగా, ప్రస్తుతం ట్రూడౌన్ చేసి ఉపశమనం కల్పించామని చెప్పారు. వీలైతే ఎన్నికల లోపు విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఈసారి బొగ్గు ఆధారంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా, ఇతరులకు భారీ సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు కేంద్రం ఇచ్చే రూ.78 వేల సబ్సిడీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు సోలార్ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ, ఇప్పటికే 6 లక్షల కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న భావనతో వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, కేంద్ర సహకారంతో పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు త్వరలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రికార్డు సమయంలో సబ్ స్టేషన్ పనులు పూర్తి చేశామని పేర్కొంటూ, రానున్న పుష్కరాలను అందరం కలిసికట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా వైభవంగా నిర్వహించు కుందామని పిలుపునిచ్చారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, వినియోగదారులపై అదనపు భారం లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండేవని, అయితే ప్రస్తుతం ఎక్కడా కోతలు లేవని పేర్కొన్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో 56 రకాల విద్యుత్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ట్రాన్స్‌కో రూపొందించిన DPR అద్భుతంగా ఉందని, దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూర్తి సహకారం అందించారని, సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థ నాయకత్వాన్ని ప్రశంసించారు.
పుష్కరాలను 2027 జూన్, జూలై నెలల్లో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రజల చిరకాల కోరిక అయిన హేవలాక్ బ్రిడ్జిను ఆధునీకరించి పాదచారులకు అనుకూలంగా సుందరీకరించనున్నట్లు చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన రూ.94 కోట్ల నిధులతో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ఉత్తరాది కుంభమేళా తరహాలో భక్తులకు వసతి కల్పించేందుకు బ్రిడ్జిలంకలో భారీ టెంట్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏర్పాట్లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ఏడాది ముందుగానే సబ్ స్టేషన్ల పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కడియం, నిడదవోలు ప్రాంతాల్లో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నట్లు వివరించారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం ప్రజల దశాబ్దాల కల అని, అది ఇప్పుడు సాకారం అవుతోందని అన్నారు. కోటిలింగాల ఘాట్ నుండి రివర్ ఫ్రంట్ సబ్ స్టేషన్ వరకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజున జరగడం విశేషమని పేర్కొన్నారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే ఇలాంటి భారీ పనులు చేపట్టడం ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, దేశంలో సౌర విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులను ప్రస్తావించారు. గతంలో అధిక వ్యయంతో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 2014 నుండి రాష్ట్రంలో 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదా లో-వోల్టేజ్ సమస్యలు లేవని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని వివరించారు. 2014 తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. పుష్కరాల అభివృద్ధిలో భాగంగా దేవాలయాలు, ఘాట్లకు ప్రాధాన్యతనిస్తూ రూ.100 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టడం సంతోషకరమన్నారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలకు 24/7 నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో రూ.49 కోట్ల వ్యయంతో 225/33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, పుష్కరాల అనంతరం కూడా ప్రజలకు ఉపయోగపడేలా కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ నగరాభివృద్ధికి కీలకమని, దీనివల్ల భవిష్యత్ అవసరాలను తీర్చగలమని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో విద్యుత్ వినియోగం పెరిగే నేపథ్యంలో సబ్ స్టేషన్ల నిర్మాణం సమస్యలను నివారించగలదన్నారు.
ముందుగా రాజమహేంద్రవరానికి విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కడియం, దివాన్ చెరువు, రంగంపేట, వెలుగుబంద ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఏపీ ఏపీడీసిఎల్ ఎస్ ఈ కె తిలక్ కుమార్ , అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *