-అఖండ గోదావరి మహా పుష్కరాలు 2027 కు సర్వం సిద్ధం చేస్తున్నాం
-రెండు నెలలు ముందుగానే విద్యుత్ పనుల పూర్తికి ప్రణాళిక
-దేశంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన మొదటి సీఎం చంద్రబాబు
-ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు చర్యలు
-గోదావరి పుష్కరాల విద్యుత్ పనుల కోసం రూ.150 కోట్లు కేటాయింపు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో జరగబోయే అఖండ గోదావరి మహా పుష్కరాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్., సహచర మంత్రి కుందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణమూర్తి, మద్దిపాటి వెంకటరాజు తో కలిసి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.485 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ముందుగా పుష్కరాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రూ. 96.90 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలు మొదటిగా అమలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఈ విషయాన్ని అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమతో చెబుతుంటే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. గోదావరి పుష్కరాల కోసమే రూ.150 కోట్లతో భక్తులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి విద్యుత్ పనులు చేపడుతన్నామని ఆయన పేర్కొన్నారు. పుష్కరాల ప్రారంభానికి రెండు నెలల ముందే విద్యుత్ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం చేపట్టిన అభివృద్ధి పనులతో రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో విద్యుత్ సమస్యలు ఉండవని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఛార్జీల తగ్గింపు, నాణ్యమైన విద్యుత్ సరఫరానే అంతిమ ధ్యేయం….
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు, నాణ్యమైన విద్యుత్ నిరంతరాయ సరఫరానే అంతిమ ధ్యేయమని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఉద్యోగులు కష్టపడి వినియోగదారుల సంతృప్త స్థాయిని 95 శాతానికి తీసుకెళ్లాలని, సీఎంకు కూడా అదే సంతృప్తి ఇస్తుందని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. కూటమి ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీ కూడా పెంచలేదని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 13 పైసలు ట్రూ డౌన్ చేయడంతో పాటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జెన్కో ఆధ్వర్యంలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి సాధించామన్నారు. లో ఓల్టేజ్ సమస్యలు పరిష్కరించడానికి, మెరుగైన విద్యుత్ వసతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో 132, 220, 400 కేవీ వంటి సబ్ స్టేషన్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అదే విధంగా రాజమండ్రి రివర్ వ్యూ ఎస్ఎస్ నుంచి కోటి లింగాల ఘాట్ వరకు భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాజమండ్రి గౌతమి పుష్కర ఘాట్ లో సోమవారం 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను, కడియం లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించామన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో అనుకున్న సమయానికంటే రెండు నెలల ముందే సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభించామని మంత్రి చెప్పారు. అదే విధంగా ఏలూరులో ఎప్పటి నుంచే సమస్యగా ఉన్న సబ్ స్టేషన్ నిర్మాణ సమస్యల్ని పరిష్కరించామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసి పనులు చేస్తుందన్నారు.
20 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ తో విద్యుత్ ఉత్పత్తి…..
వడిశలేరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ వినియోగదారులకు ఏర్పాటు చేసుకున్న పీఎం సూర్యఘర్ ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. అనంతరం రూ. కోటి పైగా నిధులతో వడిశలేరులో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే నల్లిమిల్లి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… విద్యుత్ ఛార్జీల తగ్గింపు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం., రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కేవీ విలువైన సోలార్ రూఫ్ టాప్ లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ పడాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా అత్యధిక సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల ఏర్పాటును లక్ష్యంగా చేసుకున్నామని ఆయన చెప్పారు. పీఎం సూర్యఘర్ ద్వారా సోలార్ యూనిట్లను పెట్టుకునే బీసీ వర్గాలకు రూ.98 వేలు, ఓసీ లకు రూ.78 వేలు సబ్సిడీని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో వస్తున్న సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నామన్నారు. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా పగటి పూట ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్ ను డిమాండ్ అధికంగా ఉండే రాత్రి సమయాల్లో వినియోగించు కుంటున్నమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్నదాతకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా పీఎం కుసుమ్ ద్వారా పగటి పూటే రైతులకు 9 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ ను అందిస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పీఎం కుసుమ్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. ఈ వేసవిలోనే కుసుమ్ పనులు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో రూ.300 కోట్లతో RDSS పనులు జరుగుతున్నాయని వివరించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ., గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే రూ.94 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. పుష్కర పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ త్వరలోనే రాజమండ్రిలో పర్యటిస్తుందని ఆయన తెలిపారు.
అనంతరం బొమ్మూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ ట్రాన్స్‌కో నిలయాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. వేపకాయలపాలెం దిబ్బలో టాన్స్ కో 220/33 కేవీ సబ్ స్టేషన్ ను కూడా మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. సాయంత్రంగా ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ సమీపంలోని వెలుగుబండలో 33/11 కెవి సబ్ స్టేషన్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. తదనంతరం దివాన్ చెరువు వద్ద డివిజన్, సబ్ డివిజన్, రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి గొట్టిపాటి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పురందరేశ్వరీ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News