-వీరిలో 61.53% మంది మహిళలే…
-234 వైద్యుల పోస్టుల భర్తీకి మళ్లీ త్వరలో కౌన్సెలింగ్
-మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తగా 377 మంది వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు, సివిల్ అసిస్టెంటు సర్జన్లగా విధుల్లో చేరారు. వీరిలో 232 (61.53%) మంది మహిళా డాక్టర్లు ఉండడం విశేషం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తరపున ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శాశ్వత ప్రతిపాదికన 630 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా 4,984 మంది దరఖాస్తు చేశారు. నియమ నిబంధనల ప్రకారం వీటిని పరిశీలించి ఖరారుచేసిన ఎంపిక జాబితా ప్రకారం 611 (స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన పోస్టులు కాకుండా) పోస్టుల్లో అభ్యర్థులను నియమించేందుకు ఇటీవల ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిలో 482 మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. పోస్టింగులు పొందిన వారిలో పీహెచ్సీల్లో మెడికల్ ఆఫీసర్లుగా 282, బోధనాసుపత్రుల్లో సివిల్అసిస్టెంటు సర్జన్లగా 95 మంది విధుల్లో చేరారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు
జిల్లాల వారీగా
గరిష్ఠంగా కృష్ణా జిల్లా, నంద్యాల, పల్నాడు; శ్రీకాకుళం జిల్లాల్లో పీహెచ్సీ వైద్యులుగా 16 మంది చొప్పున చేరారు కడప, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో 15, 14, 13 మంది చొప్పున విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు వెస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో 12 మంది చొప్పున వైద్యులు పీహెచ్సీల్లో మెడికల్ ఆఫీసర్లగా బాధ్యతలు చేపట్టారు.
బోధనాసుపత్రుల్లో 147 సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులకుగాను 95 మంది విధుల్లో చేరారు. వీరిలో అత్యధికంగా కడపలో 25, కాకినాడ, కర్నూలు జిల్లాలో 13 మంది చొప్పున విధుల్లో చేరారని అధికారులు వివరించారు. మొత్తంగా గిరిజన ప్రాంతాల్లో 37 మంది విధుల్లో చేరారు.
నిబంధనలకు అనుగుణంగా
ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా 611 పోస్టులను కేటాయించేందుకు ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించగా 482 మంది మాత్రమే ఆపన్లు ఇచ్చారు. 129 మంది ఆపన్లు ఇవ్వలేదు. అలాగే పోస్టింగులు పొంది విధుల్లో చేరని వారు 105 మంది ఉన్నారు. మొత్తం ఈ 234 పోస్టుల భర్తీ కోసం కిందటేడు జారీచేసిన నియామకాల నోటిఫికేషన్ అనుసరించి ఖరారు చేసిన ఎంపిక జాబితాలో మెరిటు ప్రకారం మిగిలిన అభ్యర్ధుల జాబితాను పంపించాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులు recruitment బోర్డు వారిని కోరారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇతర నిబంధనలు అనుసరించి మళ్లీ ఆన్లైన్ ద్వారా ఈ లిస్టును రూపొందిస్తారు. జీరో వెకెన్సీ కింద పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
Prajavartha Online Telugu News