-అస్తవ్యస్త పార్కింగ్‌పై అసంతృప్తి, వెంటనే చర్యలకు ఆదేశం
-ఓపీ రద్దీ, సిబ్బంది కొరత, పరికరాల అవసరంపై సమీక్ష
-రోగుల సంతృప్తే లక్ష్యం — పారిశుధ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యా, వైద్య రంగాలకు బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని తనిఖీ చేశారు. స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చిన ఆయన, అక్కడ అస్తవ్యస్తంగా నిలిపి ఉన్న వాహనాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పర్యవేక్షకులు, పార్కింగ్ ఇన్‌చార్జిని పిలిపించి, వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రదేశంలోనే నిలిపేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్‌లో స్థలం లేకుంటే ఆసుపత్రి బయటే ఉంచేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
అనంతరం ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన మంత్రి, అక్కడి ఏర్పాట్లు, వసతులు, పారిశుధ్యాన్ని సమీక్షించారు. మరోసారి తనిఖీ చేస్తానని, అప్పటికి ఏ లోపం కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని హెచ్చరించారు. రోగులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, తేడా వస్తే సహించేది లేదని తెలిపారు.
ఆసుపత్రి అంతటా రోగులతో మమేకమై వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్న మంత్రి, వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు సక్రమంగా ఇస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. అనంతరం పర్యవేక్షకులు, సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లతో సమావేశమై ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, అవసరమైన సదుపాయాలపై చర్చించారు.
ప్రతిరోజూ సుమారు 1600 మంది ఓపీ రోగులు వస్తున్నారని, 605 పడకలతో ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నడుస్తోందని మంత్రి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు మచిలీపట్నంలోనే నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. స్టాఫ్ నర్సుల కొరత సుమారు 90 మంది ఉందని, దాన్ని త్వరలో భర్తీ చేయాల్సి ఉందన్నారు.
కొన్ని పరికరాలు, వెంటిలేటర్ల అవసరం ఉన్నట్లు వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చారని, సీఎస్‌ఆర్ నిధులు, ప్రభుత్వ నిధులతో వాటిని సమకూర్చే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి మంగళవారం సదరం పరీక్షలు ఉండటంతో సాధారణ ఓపీ రోగులకు ఇబ్బంది కలుగుతున్నట్లు గమనించామని, ఈ రెండు సేవలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. డైట్ భవనంలో ఏర్పాట్లు చేసే విషయమై డీఎంహెచ్ఓతో చర్చిస్తామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు మంచి సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పర్యటనలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ లీలా ప్రసాద్, ఆర్‌ఎంఓ నిరంజన్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు, భగత్ సింగ్ నాయక్, ఎస్సీ విజిలెన్స్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News