Breaking News

భారతీయ సంస్కృతిలో అద్భుత వరం యోగా: మంత్రి కందుల దుర్గేష్

-సీఎం ఆశయాలకు అనుగుణంగా ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి: మంత్రి కందుల దుర్గేష్
-రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఘనంగా నిర్వహించిన ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఉన్నతాధికారులు
-వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుతో ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు: మంత్రి దుర్గేష్
ఐశ్వర్యానికి, ఆనందానికి
-ఆరోగ్యమే తొలిమెట్టు: మంత్రి కందుల దుర్గేష్
-మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఉత్తమ సాధనం: కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశానికి వేల సంవత్సరాల క్రితం లభించిన అమూల్యమైన ఆధ్యాత్మిక, శారీరక సంపద యోగా అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైలు ఎస్పీ ఎస్. రాహుల్, జిల్లా అధికారులు, కారాగార సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల్లో మంత్రి, అధికారులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. అనంతరం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, అది సంపూర్ణ జీవన విధానమని అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలో యోగా అత్యంత ప్రభావవంతమైన పరిష్కారంగా గుర్తింపు పొందిందన్నారు.
ఇటీవల కేరళ రాష్ట్రానికి ప్రదానం చేసిన “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్” అవార్డు స్వీకరణ సందర్భంగా అక్కడి వెల్‌నెస్ సెంటర్ల ప్రభావాన్ని ప్రత్యక్షంగా గమనించినట్లు మంత్రి తెలిపారు. యోగా, ఆయుర్వేదం ఆధారంగా అక్కడి పర్యాటక రంగం విశేష అభివృద్ధి సాధించిందని, విదేశీ పర్యాటకులు సైతం అధికంగా ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. అదే నమూనాను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 1058 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
“ఈ రోజు ఒక్కపూట యోగా చేయడం ద్వారానే నాకు ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే. యోగా అనేది ఒక రోజు కార్యక్రమం కాదు. ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితానికి ఇది శాశ్వత మార్గం” అని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, జిల్లాలో ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇతరులను జయించడం కంటే మనల్ని మనం జయించుకోవడం గొప్ప విజయమని, అందుకు యోగా, ధ్యానం ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన బహుమతిగా పేర్కొన్నారు.
యోగాను కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా జీవనశైలిలో భాగంగా మలుచుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంపొందించడంలో, వ్యక్తిత్వ వికాసంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తాను ప్రస్తుతం వారానికి రెండు రోజులు యోగా చేస్తున్నానని, ఇకపై మరింత క్రమబద్ధంగా సాధన కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సామూహిక యోగా కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
యోగాను క్రమం తప్పకుండా సాధన చేసే వారి జీవితంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తాయని తెలిపారు. ప్రతి యోగాసనానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని తెలుసుకొని ప్రతిఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. ఖైదీలలో యోగాపై ఆసక్తి చూపే వారిని గుర్తించి వివిధ స్థాయి పోటీలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత అవసరమన్నారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు యోగాసనాలు, ప్రాణాయామం సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, పనితీరు, మానసిక ప్రశాంతత గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. యోగా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి ఆధునిక జీవనశైలిలో వచ్చే అనేక వ్యాధులను దూరం చేస్తుందని చెప్పారు.

సెంట్రల్ జైలు ఎస్పీ ఎస్. రాహుల్ మాట్లాడుతూ, ఖైదీలలో కోపం, నిరాశ, మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు యోగాను దినచర్యలో భాగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కేవలం సాధనతో సరిపెట్టకుండా ‘టీచర్ టు టీచర్’ కార్యక్రమం ద్వారా ఖైదీలను యోగా శిక్షకులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 30 మంది ఖైదీలు యోగా శిక్షకులుగా మారినట్లు వెల్లడించారు.
అధిక సంఖ్యలో ఖైదీలు యోగా సాధనలో పాల్గొనడం వల్ల గత ఏడాది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో యోగా జిల్లా నోడల్ అధికారి వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైలు ఎస్పీ ఎస్ రాహుల్, ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ, సమన్వయ అధికారి డా. విజయ కుమారి, జిల్లా అధికారులు, కారాగార శాఖ అధికారులు, సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యంత క్రమశిక్షణతో యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *