-పోస్టర్ ఆవిష్కరణ ద్వారా క్యాంపెయిన్‌ను ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు జిల్లాలో జూన్ 16 నుండి జూన్ 30, 2026 వరకు “స్టాప్ డయేరియా క్యాంపెయిన్–2026” నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లో క్యాంపెయిన్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించి , వివిధ శాఖల అధికారులకు , టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, వర్షాకాలంలో సాధారణంగా డయేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ప్రబలత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియా బారిన పడకుండా కాపాడటం, డయేరియా వల్ల సంభవించే మరణాలను పూర్తిగా నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.
స్టాప్ డయేరియా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి ఇంటికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ, జింక్ మాత్రల వినియోగంపై అవగాహన, సురక్షిత తాగునీటి వినియోగం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆహార పరిశుభ్రత వంటి అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించ నున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి డయేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
వైద్య అధికారులు ఈ క్యాంపెయిన్ వివరాలు తెలియ చేస్తూ, డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని వెంటనే వినియోగించాలని ప్రజలకు సూచించాలన్నారు. జిల్లాలో ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి పిలుపు నిచ్చారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎన్. వసుంధర, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. సంధ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. బి. శ్రీదేవి, జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అధికారి డా. కె. శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News