ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత

-యాత్రి సువిధా దివస్‌లో విమానాశ్రయ అభివృద్ధి, సేవలపై అవగాహన
– ఏ పి డి కె ప్రీతి

మధురపూడి (రాజమహేంద్రవరం) , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యాత్రి సువిధా దివస్–2026” కార్యక్రమాన్ని సోమవారం మధురపూడి విమానాశ్రయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్ధిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపారు. గత పదేళ్లలో రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో పాటు కార్గో రవాణాలోనూ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
2013-14లో 1.13 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయ సేవలను వినియోగించుకోగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 5.60 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. కార్గో రవాణా కూడా గణనీయంగా పెరిగిందన్నారు. పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే విస్తరణ చేపట్టడంతో ఎయిర్‌బస్ A320, A321, బోయింగ్ 737 మ్యాక్స్ వంటి విమానాలను నిర్వహించే సామర్థ్యం లభించిందని వివరించారు.

విమానాశ్రయంలో 1 మెగావాట్ సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని తీర్చుకుంటున్నామని తెలిపారు. కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణికుల సామర్థ్యం భారీగా పెరగడంతో పాటు గోదావరి పుష్కరాలు–2027 అవసరాలను సమర్థంగా తీర్చగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాత్రి సువిధా దివస్ సందర్భంగా ప్రయాణికులకు స్వాగతం పలకడంతో పాటు మొక్కల పంపిణీ, మొక్కల నాటడం, హౌస్‌కీపింగ్ సిబ్బంది సత్కారం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రయాణికుల సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత కార్యక్రమాలకు కూడా విమానాశ్రయం ప్రాధాన్యత ఇస్తోందని కె. ప్రీతి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *