-తగు జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం దూరం
-టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ
-వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వాకథాన్
-మధుమేహ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
షుగర్ వ్యాధి పట్ల అశ్రద్ధ వహించడం తగదని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహవ్యాధితో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చని టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ అన్నారు. ఆదివారం వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా టైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. మధుమేహ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ వాకథాన్ టైమ్ హాస్పిటల్ నుంచి ప్రారంభమై పటమట ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ పువ్వాడ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మధుమేహవ్యాధి గురించి ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా ప్రాణాలను హరిస్తుందని తెలిపారు. గుండె, మూత్రపిండాలు, నేత్ర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్య తీవ్రమయ్యేంత వరకూ గుర్తించలేకపోతున్నారని, మధుమేహాన్ని తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సత్ఫాలితాలను పొందవచ్చని డాక్టర్ రామకృష్ణ వివరించారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ సక్రమమైన జీవన విధానాన్ని అవలంభించడం, మద్యపానం, ధూమపానం చేయకుండా ఉండటం, వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మధుమేహవ్యాధిని దూరం పెట్టొచ్చని అన్నారు. వ్యాధి పట్ల అవగాహన కలిగివుండటం, నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా చక్కెర వ్యాధిని కట్టడి చేయవచ్చని డాక్టర్ సురేష్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంచర్ల అనిల్, టైమ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.