విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని టీచర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం నిర్వహించిన ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖరంపై కలశ స్థాపన కార్యక్రమాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News