-రాష్ట్రంలోని 5 వైద్య కళాశాలలు టాప్ 100లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి.
-ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు పదవీ విరమణ వయసు పెంచే విషయాన్ని వరిశీలిస్తాం
-వైద్య విద్యార్థుల హాజరును ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించాలి
-2026-27 రెండో త్రైమాసికంలో బడ్జెటు, కేంద్ర సాయం వినియోగం 50%కు చేరాలి
-వైద్య విద్య నాణ్యత, బడ్జెటు వినియోగంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అతి కీలకమైన ప్రొఫెసర్ల పోస్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ వైద్య సంఘం (ఎన్ఎంసీ) ప్రమాణాల మేరకు ఒక ప్రొఫెసర్ పోస్టుకు మూడు పీజీ సీట్లను కేటాయించడం జరుగుతోంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 70 సంవత్సరాలుగా ఉండడంతో ప్రొఫెసర్ల లభ్యత పెరిగి పీజీ సీట్లు ఎక్కువగా పొందడం జరుగుతోంది. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ల పోస్టులకుగాను 200 ఖాళీగా ఉంటుండడంతో దీని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడడంతోపాటు పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. మరీ ముఖ్యంగా 16 సూపర్ స్పెషాల్టీ విభాగాల్లో 159 ప్రొఫెసర్ల పోస్టులకుగాను 106 (66%) ఖాళీలు ఉండడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం పదోన్నతుల ద్వారా ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. వివిధ విభాగాల్లో పదోన్నతికి అర్హులైన వారు లేకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనను రూపొందించాలని డీంఏఈ డాక్టర్ విష్ణువర్ధన్ ను మంత్రి సత్యకుమార్ గురువారంనాడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో 2026-27 ఆర్ధిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సాయం వినియోగo తీరుపై ఉన్నతాధికారులతో సమగ్రంగా మూడు గంటలకుపైగా మంత్రి సమీక్షించారు.
నాణ్యమైన వైద్య విద్య అతి కీలకం.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు అతి కీలకమైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సమర్థులైన వైద్యుల అవసరం ఉన్నందున రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య విద్య అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ ప్రమాణాల మేరకు అన్ని మౌలిక వసతులు ఉండేలా చూడాలని మంత్రి స్పష్టంచేశారు. ఈ అంశానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు కొంతమేరకు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో అవసరాల మేరకు బోధన వసతులు లేకున్నా ఎక్కువ సీట్లు పొందుతున్న విషయం తమ దృష్టికొచ్చిందని, ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించి, ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని వసతులు ఉండేలా చూడాలని మంత్రి స్పష్టంచేశారు. ఆకస్మిక తనిఖీల ద్వారా ఆయా కళాశాలల్లో లోపాలను గుర్తించి తగు సవరణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయం అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ అంశంపై తనకు క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని కనీసం ఐదు పూర్వ ప్రభుత్వ వైద్య కళాశాలలు బోధనపరంగా తొలి వంద జాబితాలో స్థానం పొందేలా చేయాలని అధికారులకు సూచించారు
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అదనంగా 230 ఎంబీబీఎస్, 250 పీజీ సీట్లలో ప్రవేశాలు కల్పించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు మంత్రికి తెలిపారు.
విద్యార్థుల హాజరు విషయంలో రాజీ పడొద్దు
ఎన్ఎంసీ నిబందనల ప్రకారం 75% హాజరు ఉన్న వైద్య విద్యార్థులు మాత్రమే వార్షిక పరీక్షలకు అర్హులని, ఈ విషయంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని మంత్రి స్పష్టంచేశారు. విద్యార్థుల హాజరు నమోదుకు ప్రస్తుతం అమలవుతున్న వ్యవస్థపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల హాజరును ఆన్ లైన్ ద్వారా నమోదుచేసే వ్యవస్థను వెంటనే ప్రవేశపెట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైద్య కళాశాలల్లో ‘బెడ్ సైడ్ ఎడ్యుకేషన్’ (రోగుల పరిశీలన) ద్వారా వైద్య విద్యార్థులకు బోధించడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వానికి అవకాశం ఇవ్వరాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ విశ్వవిద్యాలయం అధికారులకు స్పష్టంచేశారు. వైద్య విద్యార్థుల్లో సేవాభావం, నైతిక విలువలు పెంపొందేలా చూడాలని మంత్రి సూచించారు.
కేంద్ర సాయం వినియోగం పెరగాలి.
2026-27 ఆర్థిక సంవత్సరం మొత్తం వార్షిక బడ్జెట్ కేటాయింపు రూ.18,216 కోట్లు కాగా మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.4,130 కోట్ల వ్యయం (22.72%) జరిగినట్లు సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. ప్రతిపాదిత మొత్తం కేంద్ర సాయం రూ.2,308 కోట్లు కాగా జూన్ వరకు రూ.357 కోట్ల(15.45%)ను వినియోగించినట్లు అదికారులు తెలిపారు. మొత్తం వ్యయం సరళి కొంతమేరకు బాగానే ఉన్నా కేంద్ర సాయాన్ని తక్కువ మోతాదులో వాడుకోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకుగల కారణాలను ఆయన అధికారులతో చర్చించారు. మంజూరైన నిధుల విడుదల, వ్యయానికి సంబంధించి బిల్లుల అప్ లోడిoగ్ జాప్యంవల్ల బడ్జెటు వినియోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. వీటి గురించి ఆర్ధిక శాఖ అధికారులతో చర్చించేందుకు సమగ్ర వివరాలను అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అశించిన దానికంటే తక్కువ వ్యయాన్ని చూపించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ ఈ విషయం పై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు) ముగిసే నాటికి అన్ని విభాగాలతో కలిపి మంత్రిత్వ శాఖాపరంగా మొదటి ఆరునెలలకు వార్షిక బడ్జెటు, కేంద్ర సాయానికి సంబందించి, వినియోగాన్ని కనీసం 50% కు పెంచాలని మంత్రి ఆదేశించారు. ఆయా విభాగాలు, ఏపీఎస్ఎంఐడీసీ మధ్య సమన్వయాన్ని పెంచుకుని, ప్రాధాన్యతలు నిర్ధారించుకుని అమల్లో ఉన్న నిర్మాణాల పనుల్లో వేగాన్ని పెంచి, త్వరగా పూర్తిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ స్మరణ్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువరన్, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News