ఏడాది ముందే పుష్కర వ్యూహం… గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ

-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
-ఆరు జిల్లాల్లో భక్తులకు అత్యున్నత సౌకర్యాలు – భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
-రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి. నారాయణ, కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందనీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పర్యటనకు ముందు స్థానిక హోటల్‌లో రాజమహేంద్రవరం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు.

అనంతరం కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్లను సందర్శించిన మంత్రులు భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. సుమారు రెండు కిలో మీటర్ల మేర నడక మార్గం లో క్షేత్ర స్థాయిలో పరిశీలనా చేయడం జరిగింది.

అనంతరం ఆర్ ఎమ్ సి కార్యాలయంలో అధికారుల సమీక్ష నిర్వహించి, గోదావరి రివర్ ఫ్రంట్, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, నగరంలోని డ్రైనేజీ, సివరేజ్ వ్యవస్థల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నతాధికారులతో కలిసి పుష్కరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం – మంత్రి డా. పొంగూరు నారాయణ

మంత్రి డా. పొంగూరు నారాయణ మాట్లాడుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించి అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇరిగేషన్, దేవాదాయ, హోం, మున్సిపల్, ఆర్ అండ్ బీ, పర్యాటక తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

రాజమహేంద్రవరం నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.585 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో ప్రధాన రహదారులు, డ్రైనేజీ, సివరేజ్, తాగునీటి సరఫరా, పారిశుధ్య వ్యవస్థలను ఆధునికీకరిస్తామని తెలిపారు.
గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకే ఏడాది ముందుగానే పక్కా ప్రణాళికతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. వర్షాకాలం ముగిసిన వెంటనే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సివిల్ పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.

అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఆధ్యాత్మిక – పర్యాటక అభివృద్ధి – మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, దేవాదాయ, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన లోపాలను పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ‘అఖండ గోదావరి’ పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రాజమహేంద్రవరం ఘాట్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంతో పాటు అన్ని రకాల పర్యాటక రంగాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, గత పుష్కరాల కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో రూ.100 కోట్ల వ్యయంతో ‘అఖండ గోదావరి’ పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ పనులకు రూ.50 కోట్లు, రివర్ ఫ్రంట్‌కు రూ.22 కోట్లు, అమృత్-2.0 కింద రూ.95 కోట్లు, ఖేలో ఇండియా పథకం కింద రూ.14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గోదావరి జిల్లాల ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ ఈ పుష్కరాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు.

 

 

నిధుల సమీకరణకు ప్రభుత్వం కృషి – ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పుష్కరాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా ప్రభుత్వం నిధులను సమకూరుస్తోందన్నారు.
పోలవరం అథారిటీతో చర్చించి లెఫ్ట్ మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.250 కోట్ల నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగు తున్నాయని తెలిపారు.

 

రూ.580 కోట్లతో తొలి దశ పనులు – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కరాల తొలి దశ పనులకు రూ.580 కోట్ల నిధుల కేటాయింపు చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.
విద్యుత్ శాఖ అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులు, దేవాదాయ శాఖ రూ.15 కోట్ల పనులు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తదితర అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించినట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రూ.100 కోట్ల నిధులు, మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో రూ.100 కోట్ల అఖండ గోదావరి ప్రాజెక్టు, విద్యుత్ పనులకు రూ.50 కోట్లు, రివర్ ఫ్రంట్‌కు రూ.22 కోట్లు, అమృత్-2.0 కింద రూ.95 కోట్లు, ఖేలో ఇండియా ద్వారా రూ.14 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ గత పుష్కరాల కంటే అత్యుత్తమంగా ఈ పుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు.

ఘాట్ల సంఖ్య పెంపుతో శాశ్వత అభివృద్ధి – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇప్పటికే అన్ని శాఖలు పుష్కర పనుల్లో నిమగ్న మయ్యాయని తెలిపారు.
మంత్రి నారాయణ చొరవతో నగరంలో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ధవళేశ్వరం నుంచి వెంకటనగరం వరకు ఉన్న అన్ని ఘాట్ల అభివృద్ధికి నిధులు కేటాయించ నున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని చెప్పారు.

అంతకు ముందు స్థానిక ప్రవేటు అతిథి గృహంలో మంత్రి నారాయణ కు జిల్లా మంత్రి కందుల దుర్గేష్ స్వాగతం పలికి, మెమంటో అందచేశారు

ఈ పర్యటనలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, ఇరిగేషన్ ఎస్.ఈ. జి. శ్రీనివాసరావు, టూరిజం రీజినల్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *