గోదావరి పుష్కరాలు– 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం

– పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ, పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా, ఒక్క రోజే 68 లక్షల మంది స్నానాలు చేసిన నేపథ్యంలో, ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆ స్థాయికి తగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించి నిర్మాణాత్మకంగా పనిచేయాలని వారు సూచించారు.

స్థానిక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసీ) కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, గత పుష్కరాల నిర్వహణలో ఉన్న అనుభవాన్ని సమర్థంగా వినియోగించి ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల కోసం చేపట్టే పనులు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా నగరానికి శాశ్వత ఆస్తులుగా నిలిచే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. హైబ్రిడ్ అన్యుటీ (Hybrid Annuity) మోడల్ ద్వారా నిధులను సమీకరించి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.48 కోట్ల ఆర్‌ఎంసీ నిధులతో పాటు, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా మరో రూ.32 కోట్లు సమీకరించి, అదనంగా రూ.120 కోట్ల గ్రాంట్ పొందేలా చర్యలు చేపడుతున్నామని, తద్వారా సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీఆర్ బాండ్లకు సంబంధించిన సమగ్ర వివరాలను వెంటనే సమర్పించాలని అధికారు లను ఆదేశించారు.
అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పనులను వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేయాలని మంత్రి నారాయణ సూచించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మురుగునీటి పారుదల వ్యవస్థ, జంక్షన్‌ల ఆధునీకరణ, శానిటేషన్, విద్యుత్, తాగునీటి వంటి అన్ని అంశాలపై తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు (GO) అనుగుణంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు రాజమహేంద్రవరం నగరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు, ధవళేశ్వరం, పరిసర ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి అవసరమన్నారు. ప్రతి వారం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ జిల్లా పర్యటనకు రావడం వల్ల అభివృద్ధి పనులకు వేగం పెరగడంతో పాటు అదనపు నిధులు లభిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రకటించిన రూ.580 కోట్ల అభివృద్ధి నిధులతో పాటు తాజాగా మరో రూ.60 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. నిడదవోలు పరిధిలోని పెండ్యాల, ముక్కామల, తిపర్రు ఘాట్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాలకు తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే కొవ్వూరు– రాజానగరం మండలం విజ్జేశ్వరం –నిడదవోలు వరకు 38 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తే పర్యాటక, రవాణా పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

మంత్రి దుర్గేష్ చలోక్తులు:

పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ ప్రతి వారం జిల్లాలో పర్యటిస్తే మరిన్ని అభివృద్ధి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ చలోక్తిగా వ్యాఖ్యానించారు. గతంలో రూ.580 కోట్ల నిధులను ప్రకటించిన అనంతరం తాజాగా మరో రూ.60 కోట్ల విడుదలకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొంటూ, ఆయన తరచూ జిల్లాను సందర్శించి అభివృద్ధి పనులకు మరింత ఊతమివ్వాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల కి ముఖ్యమంత్రి ద్వారా లేఖ రాయాలని, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ద్వారా ఆయా నిధుల సేకరణ కోసం కృషి చేయడం జరుగుతుందనీ తెలియ చేసారు.

శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, పుణ్యక్షేత్రం రోడ్డు, గాడాల పుంత రోడ్డు, శ్రీరాంపురం రోడ్డు, పిడింగొయ్యి రోడ్డు అనే నాలుగు ప్రధాన రహదారుల విస్తరణకు సుమారు రూ.88 కోట్లు అవసరమని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యుత్ లో-వోల్టేజ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు అవసరమన్నారు. అలాగే సాగునీటి శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖల పనులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, రహదారుల అభివృద్ధి, జంక్షన్‌ల ఆధునీకరణ, శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ధవళేశ్వరం జనార్ధనస్వామి ఆలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సమయానికి పూర్తి చేసి రాజమహేంద్రవరాన్ని ఆదర్శ పుష్కర నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ కే. ఆదిత్య శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *