-బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు.
ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరదాగా విహారయాత్ర (టూరిజం) కోసం వియత్నాం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తో ఏపీ భవన్ అధికారులు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు మంత్రికి తెలిపారు.
ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు పర్యాటకులకు అన్ని రకాల అత్యవసర సహాయాలు అందేలా కేంద్ర విదేశాంగ శాఖతో పాటు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News