-“తెలుగు భాష, మహిళా గౌరవ పరిరక్షణ ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి బాధ్యత” – హోంమంత్రి అనిత
-“మహిళలకు మాత్రమే కాదు… అబ్బాయిలకు కూడా విలువలు, గౌరవం నేర్పించే సమయం వచ్చింది” – హోంమంత్రి అనిత
-“‘అమ్మ’ అనే ఒక్క పదంలోనే తెలుగు మమకారం, సంస్కృతి, ఆత్మీయత అంతా నిక్షిప్తమై ఉంది” – హోంమంత్రి వంగలపూడి అనిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు–2026లో ఆంధ్రప్రదేశ్ గృహ వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, మహిళా సాధికారత, పుస్తక పఠనం, సామాజిక విలువలు, మహిళల గౌరవ పరిరక్షణ వంటి అంశాలపై మంత్రి మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ, ‘దివిసీమ గాంధీ’గా పేరుపొందిన మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. 1975లో హైదరాబాద్లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలుగు భాషకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఆయన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మండలి కుటుంబం తెలుగు భాషా పరిరక్షణను వారసత్వంగా కొనసాగిస్తోందని పేర్కొంటూ మండలి బుద్ధప్రసాద్ గారిని అభినందించారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని, “ఆయన నాకు గురువులాంటి వారు… శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని మంత్రి అన్నారు.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన యద్దనపూడి సులోచనారాణి పేరును సభా ప్రాంగణానికి పెట్టడం ఆమె సాహిత్య సేవలకు దక్కిన గొప్ప గౌరవమని మంత్రి పేర్కొన్నారు. అలాగే రంగనాయకమ్మ, ఓల్గా (పి. లలితకుమారి), వాసిరెడ్డి సీతాదేవి, డి. కామేశ్వరి వంటి ప్రముఖ రచయిత్రుల సేవలను కొనియాడారు.
అదే సమయంలో మహిళా సాధికారత, ప్రజాజీవితం, సామాజిక చైతన్యానికి విశేష సేవలందించిన నన్నపనేని రాజకుమారి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “నాకు మాత్రమే కాదు… రాష్ట్ర మహిళలందరికీ ఆమె స్ఫూర్తిదాయక నాయకురాలు” అని పేర్కొన్నారు.
జస్టిస్ జ్యోతిర్మయి సమాజం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్న మంత్రి, ఈ కార్యక్రమంలో తనతో పాటు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
“తెలుగు తనం అనేది కేవలం భాష కాదు… అది మన సంస్కృతి, మన ఆత్మ” అని మంత్రి అన్నారు. పిల్లలు ఇతర భాషల్లో మాట్లాడినా, ప్రేమలోనైనా, బాధలోనైనా, ఆప్యాయతలోనైనా వారి నోట మొదట వచ్చే పదం “అమ్మ” అని పేర్కొన్నారు. “‘అమ్మ’ అనే ఒక్క పదంలోనే తెలుగు మాధుర్యం, మమకారం, అనుబంధం, ఆత్మీయత నిక్షిప్తమై ఉన్నాయి” అని తెలిపారు.
తెలుగు భాషలో యాసలు మారినా మనసులు ఒక్కటేనని పేర్కొంటూ, శ్రీకాకుళం, కృష్ణా, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల యాసలు వేరైనా భాష గొప్పతనం మారదని అన్నారు. “ప్రాంతాలు వేరైనా… పలుకు వేరైనా… మనల్ని ఏకం చేసేది తెలుగు భాష, తెలుగు మమకారమే” అని పేర్కొన్నారు.
హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది… గన్ కన్నా పుస్తకం గొప్పది. తుపాకి భయాన్ని సృష్టిస్తుంది… పుస్తకం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది” అని అన్నారు.
చిన్నతనంలో తన తండ్రి పుస్తకాలు చదివే అలవాటు పెంచారని, అదే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని గుర్తు చేసుకున్నారు. యువత పుస్తక పఠనాన్ని జీవనశైలిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళలపై జరుగుతున్న వేధింపులు, సోషల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, మహిళలకు మాత్రమే కాదు… అబ్బాయిలకు కూడా మహిళలను గౌరవించడం, సంస్కారవంతంగా ప్రవర్తించడం, బాధ్యతతో వ్యవహరించడం నేర్పించే ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
“నేడు సోషల్ మీడియాలో తల్లి ఎదుట కూడా మాట్లాడలేని భాషను, భార్యతో కూడా ఉపయోగించలేని భాషను, సోదరి లేదా కుమార్తె ఎదుట పలకలేని పదాలను కొందరు ఉపయోగిస్తున్నారు. అలాంటి వికృత సంస్కృతికి సమాజంలో స్థానం ఉండకూడదు” అని అన్నారు.
మహిళలను కించపరిచే వారిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో పుస్తక పఠనం, విలువలతో కూడిన విద్య సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
“నేడు మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు… ప్రపంచ స్థాయి విజయాలు సాధిస్తున్నారు. కానీ వారికి దక్కాల్సిన గౌరవం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో లభించడం లేదు. ఆ పరిస్థితి మారాలి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన నాగరిక సమాజం” అని మంత్రి అన్నారు.
మహిళా రిజర్వేషన్ అమలుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి, మహిళల రాజకీయ సాధికారతకు తమ కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు భాషను కాపాడేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదని… ప్రతి కుటుంబం, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి రచయిత, ప్రతి విద్యార్థి అని పేర్కొన్నారు. “తెలుగు భాష, సాహిత్య సంపదను భావితరాలకు అందించడం మనందరి కర్తవ్యం” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయిత్రులు, ప్రజాప్రతినిధులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News