-ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబయిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని తెలిపినట్లు మంత్రి దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అచంచలమైన నిబద్ధత, పట్టుదల గల ప్రజా నాయకుడని, నిరంతరం ప్రజల శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా శ్రమిస్తున్నారన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరితగతిన పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, మళ్లీ యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.సమస్య ఏదైనా, ప్రజల్లో ఉంటూ వారి కన్నీళ్లు తుడవాలనే తపన ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, అభిమానుల ప్రార్థనల బలం అండగా ఉన్నాయని, ఆయన తన శారీరక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా నిరంతరం ప్రజల కోసమే తపించే నిఖార్సైన ప్రజా నాయకుడని కొనియాడారు. రాష్ట్ర ప్రగతి ప్రయాణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన త్వరలోనే పూర్తి శక్తి సామర్థ్యాలతో,రెట్టింపు ఉత్సాహంతో విధుల్లోకి చేరుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఆయన అనారోగ్యంతో ఉన్నా ప్రజా సమస్యలపై ఆలోచన నిరంతరం సాగుతూనే ఉంటుందని, ప్రజాసేవలో అలసట ఎరుగని ఆయన పోరాట పటిమ, దృఢ సంకల్పం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News