ప్రత్యామ్నాయపంటలు సాగు చేయడం మేలు…

-ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు అండగా నిలవాలి…
-పంట నష్ట అంచనాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి…
-జిల్లా కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రబీలో సాగునీటి లభ్యత ఆశాజనకంగా లేనందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. ఈ దిశగా రైతులను చైతన్యపరచడంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్య భూమిక వహించాలన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయకట్టు రైతులు,నీటి వినియోగదారుల సంఘాలతో సంబంధిత ఇరిగేషన్ జలవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. మరి ముఖ్యంగా కాలువల శివారు ప్రాంత
రైతులకు అవగాహన కలిగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాని రైతులకు జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పావల్సిన తరుణమిదని కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. జిల్లాలో సుమారు 42 వేల హెక్టార్లలో మినుము, పెసరా, వేరుశనగ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాల ఖచ్చితమైన తుది నివేధికను త్వరితగతిన అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కోరుతున్న పియు 31, ఎల్ బిజి 752, మినుము విత్తనాలు,
టాగ్ -24 వేరుశనగ విత్తనాలు తదితర అవసరాలను గుర్తించి అందుకు తగిన ఇండెంట్ వెంటనే సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం, పెడన, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, నందిగామ, కైకలూరు తదితర ప్రాంతాల వారిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లతో కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో ఏవిధమైన విత్తనాల అవసరాలను డిమాండ్ ను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం సేకరణలో రైతులకు పూర్తి అండగా ఉండాలి…
రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించడంలో రైతులకు పూర్తి అండగా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రారంభంలో ఎంత పటిష్టంగా ఉంటే అదే చివరి వరకు సాఫీగా సాగుతుందని ఆయన అన్నారు. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాలు నివేధించాలన్నారు. తహాశీల్దార్లు, నాయకత్వం తీసుకుని విఆర్ వోలను సంబంధిత రైస్ మిల్లుల వద్ద ఉంచాలన్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలో అవసరమైన గోనెసంచులను అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ధాన్యం సేకరణకు మనం ఏర్పాటు చేసిన తేమ కొలిచే యంత్రాలను మాత్రమే వినియోగించాలని వాటి వినియోగం పై తహాశీల్దార్లకు సంబంధిత సిబ్బందికి కూడా స్పష్టత ఉండాలన్నారు. గోనెసంచుల పంపిణీ విషయంలో చిన్న, సన్నకారుల రైతులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి వారికి అందేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది నియామకంతో పాటు వారికి
పూర్తి శిక్షణ, లాగిన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పంట నష్ట సేకరణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి…
క్షేత్రస్థాయిలో పర్యటించి ఇటీవల తుఫాను ప్రభావం వలన దెబ్బ తిన్న పంట నష్ట వివరాల లెక్కింపు పూర్తి పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. వాస్తవంగా జరిగిన పంట నష్టాన్ని లెక్కించి వాస్తవ సాగుదారుడికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలు దెబ్బతినకుండా రైతులకు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.

ఇరిగేషన్ పనులకు సంబంధించి అపరేషన్ మరియు నిర్వహణ పనులకు సమగ్ర కార్యచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. డిసెంబరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుండి ఏప్రిల్ వరకు పనులు నిర్వహించి పూర్తి చేయాలన్నారు. కొత్త పనులకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కాలువల్లో తూడు తొలగించడం, పూడిక తీత, కెమికల్ సైయింగ్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి పనులను తూ.. తూ.. మంత్రంగా పనులు చేయకుండా పూర్తి నాణ్యతతో నూరు శాతం పనులు పూర్తి కావాలన్నారు. మీడియం మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ప్రతీ పనికి సంబంధించి సమగ్ర డాక్యూమెంటేషన్ ఉండాలన్నారు. ఇరిగేషన్ పనులను మరింత వేగవంతం చేసి పూర్తి చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఇరిగేషన్ ఇంజినీర్ల ను కలెక్టర్ ఆదేశించారు. నీటి తీరువా పన్నుకు సంబంధించి రికన్సలైజేషన్ డిసెంబరు 10వ తేది కల్లా పూర్తి చేయాలని తహాశీల్జార్లను, ఇరిగేషన్ ఏఇలను కలెక్టర్ ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ లో 8. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అంచన వేయడం జరిగిందన్నారు. ఇందుకు ధాన్యం వచ్చే ప్రాంతాల పరిధిలోని 734 రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. రైస్ మిల్లర్ల వద్ద ఉన్న గోనెసంచులను సేకరించడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే పంట కోత పూర్తి అయిన ప్రాంతాలలోని ఆర్ బికెలలో గోనెసంచులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ధాన్యం సేకరణ ప్రారంభమైనదని ఇప్పటికి 35 మంది రైతుల నుంచి 232 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు.

ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జలవనరుల శాఖ ఎస్ఈ ఏ మురళీకృష్ణ రెడ్డి, ఇఇలు ఏ రాజాస్వరూప్ కుమార్, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నగ, ఆయా ప్రాంతాల నుంచి సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఆర్ డిఓలు ఖజావలి, కె. రాజ్యలక్ష్మి, శ్రీనుకుమార్, వ్యవసాయశాఖ జెడి టి మోహన్ రావు, డిసిఓ, మార్క్ ఫెడ్ డియం, పలువురు ఇరిగేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, తహాశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *