Breaking News

పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిప్పులు.. ‘దోపిడీ’ ప్రాజెక్టుగా మార్చేశారని ధ్వజం… : మస్తాన్ వలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి పోలవరం జాతీయ ప్రాజెక్టును పాలకులందరూ కలిసి ఒక ‘దోపిడీ’ ప్రాజెక్టుగా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ‘ఏటీఎం’లా మార్చేశారని కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వల్లీ, తీవ్రంగా విమర్శించారు. మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్నంభవన్ లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలి, మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 23,291 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ప్రాజెక్టును, నేడు 62,000 కోట్ల రూపాయలకు పెంచి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకే పెద్దపీట. పెనాల్టీలు ఏవి? ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన మెగా ఇంజనీరింగ్, నవయుగ, సూర్య కన్స్ట్రక్షన్ వంటి సంస్థలు గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా వారిపై పెనాల్టీలు వేయకుండా ప్రభుత్వం రక్షిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నిబంధనల ప్రకారం టెండర్లు లేకుండానే సూర్య కన్స్ట్రక్షన్ వంటి సంస్థలకు 192 కోట్ల రూపాయల పనులు కట్టబెట్టారని ఆర్టీఐ ఆధారాలను చూపారు. ఈ కాంట్రాక్టర్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నిధులు ఇస్తున్నారని అందుకే వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
మొక్కుబడిగా మొదటి దశ రైతులకు ఒరిగేదేమిటి?
ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకుండా, కేవలం 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశను పూర్తి చేస్తామని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. కేవలం విశాఖలోని డేటా సెంటర్లకు, పరిశ్రమలకు నీరు అందించడం కోసమే ఈ తొందరపాటు అని, దీనివల్ల సాగునీటి అవసరాలు తీరవని పేర్కొన్నారు. 28 లక్షల ఎకరాలకు సాగునీరు విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు తాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును కేవలం 2-4 లక్షల ఎకరాలకే పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితుల గోడు పట్టదా?
ప్రాజెక్టు కోసం భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేద రైతుల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. పునరావాసం (R&R) కోసం కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు కేవలం 11% మాత్రమే ఖర్చు చేశారని, ఇంకా 7,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. సరైన వసతులు లేని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని హెచ్చరించారు.
డిమాండ్లు
పోలవరం పనుల్లో జరిగిన అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిర్వాసితులకు వెంటనే పూర్తిస్థాయి పరిహారం అందించి, పునరావాసం కల్పించాలి. ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతోనే నిర్మించాలి. తమ వద్ద ఉన్న ఆర్టీఐ ఆధారాలతో ఈ అక్రమాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలి, స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *