-పరిశుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి ప్రమాణాలపై ప్రజారోగ్య అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం గుణదల, ఊర్మిళానగర్, లబ్బీపేట ప్రాంతాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లపై ప్రజారోగ్య అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, పరిసరాల శుభ్రత, సిబ్బంది పరిశుభ్రత వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే మరియు వినియోగదారులకు సరఫరా చేసే తాగునీరు నాణ్యతపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. తాగునీటిని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షలకు పంపిస్తున్నారా, నీటి శుద్ధి ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తున్నారా, ఆర్వో ప్లాంట్లలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య అధికారులు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. పరిశుభ్రమైన వంటగది, నాణ్యమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించడం ప్రతి ఆహార వ్యాపార సంస్థ బాధ్యత అని తెలిపారు. ప్రజలకు అందించే ఆహారం, తాగునీటి విషయంలో నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తనిఖీల సందర్భంగా ఎక్కడైనా అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్వైజర్ సలీం అహ్మద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News