-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రూ.6 కోట్లతో అన్ని హాస్టళ్లకూ శానిటరీ కిట్ల పంపిణీ
-ఒక్కో కిట్ లో 11 రకాల వస్తువులు
-పరిశుభ్ర వాతావరణంలో బీసీ బిడ్డల విద్య
-హాస్టళ్లలో పారిశుధ్యం మెరుగుకు 1,200 మందిని నియమించాం
-రాబోయే టెన్త్, ఇంటర్ కు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు
-విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ : మంత్రి సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దేశించుకున్న ‘విజన్–2047’ లక్ష్యాలను చేరుకునే క్రమంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బీసీ హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇందుకోసం రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. బుధవారం విజయవాడ గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సవిత శానిటేషన్ మెటీరియల్‌తో కూడిన శానిటరీ కిట్లను వర్కర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీసీ హాస్టళ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. గతంలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు చేపట్టి అవసరమైన మౌలిక వసతులను కల్పించామన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్‌వో ప్లాంట్లు, విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్లు, కిటికీలకు నెట్లు, విద్యార్థుల సౌకర్యార్థం హ్యాంగింగ్ హుక్స్ వంటి వసతులను ఏర్పాటు చేశామన్నారు.
బీసీ హాస్టళ్లకు రూ.6 కోట్లతో శానిటరీ కిట్లు
హాస్టళ్లలో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. వసతి గృహాల్లో పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు 1,100 కొత్త టాయిలెట్లను నిర్మించామని మంత్రి తెలిపారు. వాటి నిర్వహణ, పరిశుభ్రత కోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది శానిటేషన్ వర్కర్లను నియమించినట్లు చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బందిని కేటాయించామని తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, ఇతర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సుమారు రూ.6 కోట్ల వ్యయంతో 11 రకాల వస్తువులతో కూడిన శానిటరీ కిట్లను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సవిత తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వంటి ప్రత్యేక సేవలను కూడా అందిస్తున్నామని చెప్పారు. టాయిలెట్లు, కారిడార్లు, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతకు సంబంధించి శానిటేషన్ సిబ్బందికి స్పష్టమైన ఎస్‌ఓపీ (SOP) జారీ చేశామని, కిట్ల నిర్వహణపై వార్డెన్లకు కూడా నిబంధనలు రూపొందించామని వివరించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్లను 1-స్టార్ నుంచి 5-స్టార్ వరకు విభజించి, నెల, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, వార్షికంగా అవసరమైన శానిటేషన్ సామగ్రిని అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
హాస్టల్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనకు ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక కోచింగ్ తరగతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ’తల్లికి వందనం’తో పాటు ఇంటర్ విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి అండగా నిలుస్తోందన్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు డైట్ ఛార్జీలను 10 శాతం పెంచినట్లు మంత్రి తెలిపారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వసతి గృహాలకు అవసరమైన కొత్త వంట సామగ్రిని సమకూర్చడంతో పాటు, అవసరానికి అనుగుణంగా కుక్-కమ్-అటెండర్లు, కుక్స్, హెల్పర్లను కూడా నియమిస్తున్నామని తెలిపారు. హాస్టళ్లలో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ తెలిపారు. గత రెండేళ్లుగా ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్టళ్ల పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తూ, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. హాస్టళ్ల పరిశుభ్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో శానిటేషన్ సిబ్బందిని నియమించడంతో పాటు, అవసరమైన శానిటేషన్ మెటీరియల్‌ను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్. మల్లిఖార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లలో తొలిసారిగా దాదాపు 1,290 మంది పారిశుధ్య కార్మికులను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కార్మికులను కేటాయించామని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 1 నుంచి 5 స్టార్ శానిటేషన్ కిట్లను రూపొందించి, వార్షికంగా రూ.15 వేల నుంచి లక్ష రూపాయలకు పైబడిన విలువైన సామగ్రిని అందిస్తున్నట్లు వెల్లడించారు. టాయిలెట్లు, కారిడార్లు, తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతకు ఎస్వోపీ లు అమలు చేస్తున్నామని, కిట్ల నిర్వహణపై వార్డెన్లకు నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించి విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని మల్లిఖార్జున పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. హాస్టల్ లో అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు హాస్టల్ లో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకును పరిశీలించి, నీరు తాగి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థినులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజన ఆహార పదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆర్.శ్రీధర్ రెడ్డి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ. జగ్గయ్య, వార్డన్ ఎమ్.రజని పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News