Breaking News

జయంతిపురంలో ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం నాటికి అన్ని మౌలిక వసతులతో పార్క్‌ను సిద్ధం చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏర్పాటు చేస్తున్న ఎం.ఎస్.ఎం.ఈ. (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పార్క్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.
గురువారం జగ్గయ్యపేట జయంతిపురంలో నిర్మాణంలో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పార్క్‌లో చేపడుతున్న వివిధ మౌలిక వసతుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్‌లో నిర్మాణంలో ఉన్న అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా పనుల పురోగతి, నాణ్యత, పూర్తయ్యే సమయం తదితర అంశాలపై ఏపీఐఐసీ ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ ప్రారంభోత్సవానికి ముందే అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ పార్క్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభించనుంది. పార్క్ ఆవరణలో కొన్నిచోట్ల ఉన్న పొదలు, అనవసరమైన చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పార్క్ మొత్తం ఆవరణను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడత ఎం.ఎస్.ఎం.ఈ. పార్కుల ప్రారంభోత్సవాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మన జిల్లాలోని జగ్గయ్యపేట ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్‌ను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో, ఇప్పటికే చేపట్టిన అన్ని పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవం నాటికి పార్క్‌ను అన్ని హంగులతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించి, వివిధ మౌలిక వసతులు, వాటి ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జగ్గయ్యపేట ప్రాంతంలో ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్ ఏర్పాటుతో స్థానికంగా పారిశ్రామిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందడంతో పాటు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పార్క్‌ను నిర్ణీత సమయానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనిల్ కుమార్, ఏపీఐఐసీ జెడ్.ఎం. బాబ్జి, డిప్యూటీ జెడ్.ఎం.ఇంజనీర్ జి.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *