Breaking News

సెప్టెంబర్ 5న విజయవాడ “ఏ కన్వెన్షన్ సెంటర్‌”లో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం

-పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డుల ప్రదానం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కేంద్రంగా సెప్టెంబర్ 5వ తేదీన ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో, ఘనంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన 183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అవార్డులు అందుకోనున్న వారి జాబితాను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, జాబితాలోని వరుస క్రమం ప్రకారం ఉపాధ్యాయులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవార్డు గ్రహీతలకు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం, ఆహ్వానాలు తదితర వివరాలను సకాలంలో అందించి, కార్యక్రమ ప్రాంగణంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో వందేమాతరం, జనగణమన, మా తెలుగు తల్లి గీతాలాపనకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గీతాలాపన కార్యక్రమం సమయానుకూలంగా, క్రమబద్ధంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అవార్డు గ్రహీతలు తదితరులకు ఆహ్వాన పత్రాలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అతిథుల రాక, కూర్చునే ఏర్పాట్లు, వేదిక నిర్వహణ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమ ప్రాంగణంలో అవసరమైన బారికేడింగ్ ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ శాఖ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమ సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ముందస్తు జాగ్రత్తగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కార్యక్రమానికి ముందుగానే తనిఖీ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మొక్కలు, పచ్చదనంతో అలంకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ఉపాధ్యాయులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య శాఖ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ అధికారులు వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలను సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. గురుపూజోత్సవ కార్యక్రమ విజయవంతానికి వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలను అధికారులు పూర్తి సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి చివరి నిమిషం సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రాష్ట్రస్థాయి గురుపూజోత్సవానికి విజయవాడ వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు, రాజమండ్రి ఆర్జేడీ నాగమణి, డీఆర్వో వెన్నెల శ్రీను, డీఈఓ ఎల్.చంద్రకళ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *