Breaking News

స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలో తన పర్యటనలో భాగంగా లబ్బీపేట, రామలింగేశ్వరనగర్, కృష్ణలంక, రాణిగారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా స్క్యూ బ్రిడ్జి వద్ద ఉన్న అండర్‌పాస్‌ను పరిశీలించిన కమిషనర్, అక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అండర్‌పాస్ గోడలకు ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్ వేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగేలా అండర్‌పాస్‌ను సుందరీకరించి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

అనంతరం రామలింగేశ్వరనగర్‌లోని సాయిరాం కట్‌పీసెస్ ప్రాంతం చివర కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన మోటార్ పంపులను కమిషనర్ పరిశీలించారు. వర్షాలు కురిసే సమయంలో నివాస ప్రాంతాల్లోకి నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మోటార్ పంపులను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు చేరిన వెంటనే పంపుల ద్వారా నీటిని బయటకు తరలించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం రాణిగారి తోట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారం నాణ్యత, రుచి, పరిశుభ్రతతో పాటు అక్కడ అందుతున్న సౌకర్యాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా, క్యాంటీన్‌లో అందుతున్న ఆహారం నాణ్యతతో పాటు అన్ని సౌకర్యాలు బాగున్నాయని, తాము సంతృప్తిగా ఉన్నామని ప్రజలు కమిషనర్‌కు తెలిపారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్‌చార్జ్ రామారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి. మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *