-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని 27, 37వ డివిజన్ల పరిధిలో మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం ప్రాంతంలో మటన్, చికెన్ షాపులను అధికారులు తనిఖీ చేసి, షాపుల్లో మాంసం నిల్వ మరియు విక్రయ విధానం, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాంసాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేసి విక్రయించాలని, మాంస వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేయకుండా సక్రమంగా తొలగించాలని షాపుల యాజమాన్యాలకు సూచించారు.
మాంసం వ్యర్థాల కారణంగా దుర్వాసన, ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, షాపుల వద్ద అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత షాపులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా 37వ డివిజన్ పరిధిలోని కాళేశ్వరరావు మార్కెట్, తారాపేట, కెనాల్ రోడ్డు, మెయిన్ బజార్ ప్రాంతాల్లోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. తారాపేటలోని ఫౌండ్రీ కరిముల్లా బిర్యానీ పాయింట్, మెయిన్ బజార్‌లోని హోటల్ పంచవటి తదితర హోటళ్లను తనిఖీ చేయగా, కిచెన్ గదులకు టైల్స్ లేకపోవడం, గోడలు మరియు ఇతర ప్రదేశాల్లో బూజు ఏర్పడి ఉండటం, అపరిశుభ్రమైన వాతావరణం నెలకొని ఉండటం వంటి లోపాలను గుర్తించారు.
అలాగే నాణ్యమైన తాగునీటిని వినియోగించకపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ మరియు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు సంబంధిత రెండు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న హోటల్ యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దుకోవాలని, పరిశుభ్రత, ఆహార భద్రత మరియు ప్రజారోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా లోపాలను సరిచేయని పక్షంలో చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోటళ్లు, మటన్, చికెన్ షాపుల యాజమాన్యాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఆహారం మరియు మాంసాన్ని ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో అందించాలని అధికారులు సూచించారు. నగరంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్య ప్రమాణాల పరిరక్షణకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో శానిటరీ సూపర్‌వైజర్లు సలీం అహ్మద్, డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బి. యోగేంద్ర కుమార్, ఎం. రవిశంకర్, ప్రజారోగ్య విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News