అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ బలోపేతం, విస్తరణ లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ప్రకటించారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, విద్యావంతులు, సామాజికవేత్తలు, యువత, వివిధ రంగాల ప్రముఖులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో, వారి చేరికలను సమన్వయం చేసి పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఈ కమిటీ నిర్వహించనుంది.
ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నాయకులు కొటికలపూడి చినబాబు, డా. పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా నియమితులయ్యారు.
డా. పసుపులేటి హరిప్రసాద్ కి పార్టీ అధిష్ఠానం ఈ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల రాష్ట్ర, జిల్లా, నగర కార్యవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన సిద్ధాంతాల ప్రచారం, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో డా. హరిప్రసాద్ విశేష కృషి చేశారని నాయకులు కొనియాడారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పార్టీలోకి ఆహ్వానించడంలో డా. హరిప్రసాద్ అనుభవం, నాయకత్వం కీలకంగా మారుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, నగర కార్యవర్గ నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు డా. పసుపులేటి హరిప్రసాద్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
“జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి, పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తాం” అని నాయకులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News